సెల్ ఫోన్లు భార్యా భర్తల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి, వారి మధ్య అనుమానాలని పెంచుతున్నాయి అనే ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం అలాంటిదే ఒక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అందుతున్న సమాచారం మేరకు ఎన్నిసార్లు నచ్చజెప్పినా వినకుండా భార్య ఫోన్ లోనే మాట్లాడుతున్నందుకు ఆగ్రహించిన ఓ భర్త, ఆమె చెవిని కోసేశాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో రెండ్రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సేలంలో ఓ ఫ్యాక్టరీలో పనిచేసే ముత్తురాజా, ప్రైవేటు స్కూల్ లో అసిస్టెంట్ హెడ్మాస్టర్ గా పనిచేసే సంధ్య భార్య భర్తలు ఎడప్పాటి పెరుమాళ్గుడి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సంధ్య ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతూ గడిపేది.భర్తను పట్టించుకునేది కాదు. దీంతో పద్ధతి మార్చుకోవాలని ఆమెను పలుమార్లు ముత్తురాజా హెచ్చరించాడు. అయినా ఆమె ఎప్పుడు ముత్తు మాటలని సీరియస్ గా తీసుకోలేదు.
రెండ్రోజుల క్రితం రాత్రి పనినుంచి ఇంటికొచ్చిన ముత్తురాజాను పట్టించుకోని సంధ్య ఫోన్ సంభాషణల్లో మునిగిపోయింది. తాను వచ్చినా పట్టించుకోకపోవడం, ఫోన్ లో నవ్వుతూ మాట్లాడటంతో అసహనానికి లోనైన ముత్తురాజా కత్తిపీటతో సంధ్య కుడిచెవిని కోసి పారేశాడు. దీంతో బాధితురాలు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో ముత్తురాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.