భార్య అంత్యక్రియలు జరిగిన కొద్దిసేపటికి భర్త కూడా ప్రాణాలు విడిచిన విషాద సంఘటన గంగవరంలో సోమవారం జరిగింది. పాత గంగవరం గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు పరదా చిన్నాలుదొర (76), నర్సాయమ్మ (65) దంపతులు రంపచోడవరంలో నివాసం ఉంటున్నారు. నర్సాయమ్మ ఆదివారం సాయంత్రం మరణించారు. ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు పాత గంగవరంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో నిర్వహించారు.
ఆమె లేని బతుకు వద్దనుకున్నారో ఏమో.. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న చిన్నాలుదొర మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రాణాలు విడిచిపెట్టారు. ఒకరి తరువాత ఒకరుగా దంపతులిద్దరూ గంటల వ్యవధిలో మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నాలుదొర అంత్యక్రియలు సోమవారం సాయంత్రం నిర్వహించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెదకుమార్తె మడకం ఝాన్సీలక్ష్మి ఎంపీపీగా పని చేశారు. చిన్నాలుదొర దంపతుల మృతి పట్ల పలువురు ప్రగాఢ సంతాపం తెలిపారు.