తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పొడిచి చంపాడో భర్త. కళ్లముందే భార్య వేరొకరితో ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయిన నిందితుడు కూరగాయలు తరిగే కత్తితో అతడిపై దాడిచేసి పొడిచి చంపాడు. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లాలోని రేకులతండాకు చెందిన రమేశ్ -శాంతి దంపతులు. కూలిపనులు చేస్తూ జీవించేవారు. ఈ క్రమంలో శాంతికి రాము అనే వ్యక్తితో పరిచయమైంది. అది ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలిసిన భర్త రమేశ్ పంచాయితీ కూడా నిర్వహించాడు. వారు శాంతికి నచ్చజెప్పారు. అయితే అక్కడే ఉంటే అది తన జీవితానికి ప్రమాదమని భావించిన రమేశ్ ఏడాది క్రితం హైదరాబాద్ వచ్చి మణికొండలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పనికి కుదిరాడు. భార్యతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం నగరానికి వచ్చిన రాము బుధవారం రాత్రి రమేశ్ లేని సమయంలో వారి ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన రమేశ్ భార్యను ప్రియుడితో చూసి రగిలిపోయాడు. వెంటనే వంటింట్లోకి వెళ్లి కూరగాయలు తరిగే కత్తిని తీసుకొచ్చి రాముపై దాడిచేశాడు. పలుమార్లు పొట్టలో పొడవడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం రమేశ్ కత్తిపట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.