భార్యను పీక నులిమి కడతేర్చిన భర్త

భార్యను పీక నులిమి కడతేర్చిన భర్త

ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు… పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నా రు… అనంతరం మనస్పర్థలు తలెత్తాయి… తనతోపాటు కుటుంబ సభ్యులతోనూ దురుసుగా ప్రవర్తించడంతో భార్యను వదిలించుకోవాలనుకున్నాడు… ఈ క్రమంలో స్నేహితుడు, ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో భార్యను పీక నులిమి కడతేర్చేశాడు… ఈ హత్య నగరంలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కోడిపందాల వీధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన మౌళి (25) కొంతకాలంగా విశాఖపట్నంలో ఉంటూ ఫైర్‌ అండ్‌ సేఫ్టీకి సంబంధించిన పైపు లైన్‌లను అమర్చే పని చేసేవాడు. నగరంలోని ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తున్న పాతనగరం కోడి పందాల వీధికి చెందిన చల్లపల్లి లక్ష్మి (21)ని ప్రేమించి గత ఏడాది అక్టోబరు నెలలో వివాహం చేసుకున్నాడు.

అనంతరం భార్యను తీసుకుని విజయనగరంలోని తన స్వగ్రామానికి మౌళి వెళ్లిపోయాడు. అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ ఆమె తల్లిదండ్రులు రూ.60 వేలు కట్నం, ద్విచక్ర వాహనం, అర తులం బంగారం కానుకగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మే నెలలో దంపతులు ఇద్దరూ నగరానికి వచ్చి కోడిపందాల వీధిలోని లక్ష్మి పుట్టింటిలో ఉంటున్నారు. తాగుడుకు బానిసైన మౌళి తన స్నేహితుడు ఎల్లాజీతో కలిసి నిత్యం మద్యం సేవిస్తూ ఉండేవాడు. మరోవైపు అత్తవారింటిలో భర్తతోపాటు అతని కుటుంబ సభ్యులతో లక్ష్మి దురుసుగా ప్రవర్తించేదని సమాచారం. ఇదే విషయాన్ని తన స్నేహితుడు ఎల్లాజీతో ఆదివారం మద్యం సేవిస్తూ మౌళీ చెప్పాడు. అనంతరం భార్య కుటుంబ సభ్యులతోనూ చర్చించాడు.

లక్ష్మి తల్లి, అక్క, సోదరుడు ప్రోత్సాహంతో భార్యను మట్టుబెట్టాలని మౌళి నిర్ణయించుకున్నాడు. ప్రణాళికలో భాగంగా ఇంటి నుంచి ముందుగానే లక్ష్మి తల్లి, సోదరి, సోదరుడు బయటకు వెళ్లిపోయారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత లక్షి్మ, మౌళి ఘర్షణ పడ్డారు. భార్య దాడి చేయడంతో మౌళి చున్నీ సహాయంతో ఆమె పీక నులిమి హత్య చేయగా, అందుకు స్నేహితుడు ఎల్లాజీ సహకరించాడు. సోమవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో వన్‌టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రస్తుతం మౌళి, ఎల్లాజీలను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.