ఐదో ఫ్లోర్‌ నుంచి పడి ఓ యువతి మృతి

ఐదో ఫ్లోర్‌ నుంచి పడి ఓ యువతి మృతి

గురుగ్రామ్‌లో ఓ యువతి ఐదో ఫ్లోర్‌ నుంచి పడి మరణించడం కలకలం రేపింది. అయితే ఆమె ఓ గెట్‌ టూగెదర్‌ పార్టీకి హాజరైన సమయంలో ఇలా జరగడం పలు అనుమానాలు తావిస్తోంది. ఆదివారం రాత్రి 10 గంటలకు సెక్టార్ 65 లో బెస్టెక్ పార్క్ వ్యూ స్పాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరణించిన బాధితురాలిని ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల పెగ్గిలా భూటియాగా గుర్తించారు. బాధితురాలి సోదరి బాబిలా భూటియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెగ్గిలా బిల్డింగ్‌ పై నుంచి దూకిన సమయంలో అక్కడే ఉన్న ఆమె బాయ్‌ఫ్రెండ్‌ పేరును కూడా ఆ కేసులో చేర్చారు.

‘పెగ్గిలా తన బాయ్‌ఫ్రెండ్‌తో మూడేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నారు. అయితే గత నాలుగు వారాల నుంచి అతడు పెగిలాకు దూరంగా ఉంటున్నాడు. అలాగే ఆమెను సోషల్‌ మీడియాలో కూడా బ్లాక్‌ చేశారు. అయినప్పటికీ బాయ్‌ఫ్రెండ్‌తో కలవడానికి పెగ్గిలా చాలా ప్రయత్నించారు. ఎందుకంటే అతన్ని ఆమె అమితంగా ప్రేమించారు. అయితే ఉన్నట్టు ఉండి అతడు.. సెక్టార్‌ 65లోని తన ఫ్రెండ్‌ నివాసంలో గెట్‌ టూగెదర్‌కు హాజరు కావాల్సిందిగా పెగ్గిలాకు మెయిల్‌ పంపాడు. దీంతో ఆమె అక్కడికి వెళ్లారు. అక్కడి వెళ్లాక ఈ ప్రమాదం జరిగింది’ అని బాబిలా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే పెగ్గిలా అక్కడి వెళ్లిన సమయంలో ప్రమాదం ఎలా జరిగింది అని అనుమానం కూడా వ్యక్తం చేశారు.

అయితే బిల్డింగ్‌ పైనుంచి పడిపోయి తీవ్రగాయాలతో ఉన్న పెగ్గిలా ఆస్పత్రికి తరలించారని గురుగ్రామ్‌ పోలీసులు తెలిపారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందినట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్‌ చేయలేదని.. సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేసి దర్యప్తు జరుపుతున్నామని తెలిపారు.