ఆంధ్రప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఓ పక్క కరోనా వైరస్ తో ఏపీ హడలెత్తిపోతుంటే.. మరోపక్క ఘోరాలు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఓ సంచలన నిజం వెలుగు చూసింది. ప్రియుడి కోసం భార్య ఏకంగా భర్తనే లారీతో తొక్కించి హత్య చేయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్దమండ్యం మండలంలోని చెరువు ముందరపల్లెకు చెందిన బాలసుబ్రహ్మణ్యం 11 ఏళ్ల క్రితం నీరుగట్టువారిపల్లెకు చెందిన రేణుకను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మదనపల్లెలోని కదిరి రోడ్డులో గిఫ్ట్ సెంటర్ నడుపుతున్న వీరికి ముగ్గురు పిల్లలున్నారు. అయితే.. వ్యాపారంలో నష్టం రావడంతో రెండేళ్ల క్రితం తిరుపతి వెళ్లిన బాలసుబ్రహ్మణ్యం ట్రావెల్స్ వ్యాపారంలోకి దిగాడు.
అదేసమయంలో పిల్లలతో కలిసి మదనపల్లెలో ఉంటున్న రేణుకకు ఓ పార్టీకి చెందిన సేవాదళ్ కార్యకర్త కె.నాగిరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఏర్పడి అది అతి సమీపానికి దారితీసింది. అయితే తాజాగా మదనపల్లెకు వచ్చిన బాలసుబ్రహ్మణ్యం తన భార్య నాగిరెడ్డితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి పలుమార్లు హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.
కాగా భర్తను ఏ విధంగానైనా సరే వదిలించుకోవాలని భార్య పలుమార్లు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ప్రియుడు నాగిరెడ్డితో కలిసి పలు వ్యూహాలను రచించింది. ఏకంగా భర్తను హత్య చేయించేందుకు సిద్ధమైంది. తాజాగా బాలసుబ్రహ్మణ్యానికి జలుబు చేయడంతో మందులు తీసుకొని రమ్మని రాత్రి 11 గంటలకు భార్య ఒత్తిడి తెచ్చింది. అతడు బయటకు వెళ్లగానే విషయాన్ని ప్రియుడికి తెలిపింది. అదే సమయంలో నాగిరెడ్డి మందులు తీసుకుని వస్తున్న బాలసుబ్రహ్మణ్యాన్ని లారీతో ఢీకొట్టి హత్య చేశాడు. బాలసుబ్రహ్మణ్యం సోదరుడు, న్యాయవాది అయిన కె.రఘుపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేప్టటిన పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు. రేణుక, ఆమె ప్రియుడు నాగిరెడ్డినీ పోలీసులు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.