ట్రయిలర్ తోనే కుర్రకారులో హుషారు రేకెత్తిస్తున్న తెలుగు చిత్రం ‘హుషారు’. ఈ సినిమాతో నూతన దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి అనే కుర్రాడు తెలుగు సినిమా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాని లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తుండడంతో ఈ సినిమాపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు ఈ శ్రీహర్ష అనే ఒక కుర్రాడు తన మొదటి సినిమాకి నిర్మాతని ఎలా ఒప్పించాడనే విషయం ఆసక్తికరంగా ఉంది. ఈ యువదర్శకుడు శ్రీహర్ష కొనుగంటి పుట్టిపెరిగింది అంతా హైదరాబాద్లోనే. చిన్నప్పటి నుండి కథలు, సినిమాలు పైన ఆసక్తి ఉండడంతో, ఖాళీ దొరికితే కథలు చదువుతూ, చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూస్తూ సినిమాలోని షాట్లను దర్శకుడు ఎలా తెరకెక్కిస్తున్నాడో గమనించేవాడంట. మనోడి ఆసక్తిని చూసి వాళ్ళ మదర్ ఒక చిన్న కెమెరా కొనిస్తే, ఆ కెమెరా తో చిన్న చిన్న షార్ట్ ఫిల్ములు తీసి, అవి క్వాలిటీగా లేకపోవడంతో ఫిలిం మేకింగ్ కోర్స్ లో జాయిన్ అవుదామనుకున్నాడు.
ఇక్కడివరకు అంత బాగున్నా, ఇవేమి వద్దు, బుద్ధిగా సివిల్స్ కి ప్రిపేర్ అవ్వు అని వాళ్ళ నాన్న అనేసరికి, ఆ అవకాశమే తన సినిమా కల స్వేచ్ఛకి శ్రీకారం అనుకొని కోచింగ్ లో జాయిన్ అయ్యి, సరిగ్గా క్లాసులకు హాజరవ్వకుండా తనలో మెదిలే ఒక లైన్ ని తీసుకొని కథగా రాసుకున్నాడు. సినిమా కథ రాశాక తానే ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసి, తన దగ్గరున్న డబ్బులతోనే ఒక చిన్న సినిమాగా రూపొందిద్దాం అనుకున్నాడు. కానీ తన శ్రేయోభిలాషి ఒకరు “నువ్వు సినిమా తీసినా, అది రిలీజ్ చేయడం కష్టం అవుతుంది” అని చెప్పడంతో ఏమి చేయాలో తెలియక గూగుల్ లో బెస్ట్ ఫిలిం ప్రొడక్షన్ హౌసెస్ అని కొట్టగానే లక్కీ మీడియా అని రావడంతో ఆ ఆఫీస్ అడ్రస్ కనుక్కొని వెళ్లి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ కి రెండు గంటల పాటు కథ చెప్పాడంట. ఈ బోల్డ్ ట్రెండీ స్టోరీ కి ఫిదా అయిన నిర్మాత చేద్దాం అనడంతో ఈ హుషారు సినిమా అలా పట్టాలెక్కిందంటా. ఈ సినిమా గురించి చెప్తూ, ఈ సినిమా నలుగురి స్నేహితుల మధ్య జరిగే కథ అని, అంతేకాకుండా సినిమా పోస్టర్లలో చూపించిన బీర్ బాటిల్ ప్రధానాంశంగా బీర్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర గా ఉంటుందని, ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పాడు ఈ యువ దర్శకుడు. ఈ సినిమా డిసెంబర్ 7 న విడుదలవ్వబోతుంది.