రాష్ట్ర విభజనకు ముందు ఐటీ రంగం పుణ్యమా అని తెలుగు వారికి.. హైదరాబాద్ కు కొత్త ఇమేజ్ క్రియేట్ అయ్యిందని చెప్పాలి. ఒకప్పుడు అమెరికాలో జాబ్ అంటే అదో కలగా ఉంటే.. ఐటీ పుణ్యమా అని.. ప్రతి తెలుగు లోగిలోనూ ఒకరిద్దరు అమెరికాలో ఉండే పరిస్థితి. అదే సమయంలో.. హైదరాబాద్ లోనూ ఐటీ రంగం ప్రాధాన్యం అంతకంతకూ పెరిగిపోయింది.
పలు గ్లోబల్ సంస్థలు హైదరాబాద్ లో తమ కార్యాలయాల్ని ఏర్పాటు చేయటం చూస్తే.. ఐటీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యత ఏమిటన్నది ఇట్టే అర్థం కాక మానదు. ఐటీ టెక్నాలజీ సొల్యూషన్స్ విషయంలో ప్రపంచ స్థాయి సామర్థ్యం హైదరాబాద్ సొంతంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అభివర్ణిస్తున్నారు.
యాపిల్.. ఫేస్ బుక్.. అమెజాన్ లాంటి టాప్ కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యాలయాన్ని తెరవటం.. కార్యకలాపాల్ని ముమ్మరంగా చేపట్టం చూస్తే.. ఐటీ రంగంలో బెంగళూరుకు ప్రధాన పోటీదారుగా మారటమే కాదు.. కొన్ని విషయాల్లో బెంగళూరును కూడా దాటేసిందన్న వ్యాఖ్య చేయటం గమనార్హం.
ఐటీ రంగంలో హైదరాబాద్ 17 శాతం గ్రోత్ రేట్ ను నమోదు చేసిందని.. ఐదు లక్షలకు మించిన ఐటీ ఉద్యోగులు ఐటీ కారిడార్ లో పని చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు కేవలం మూడు లక్షల మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ లో పని చేస్తుండగా.. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో దాదాపు 12.67 లక్షల ఉద్యోగాల్ని క్రియేట్ చేయగలిగినట్లు చెప్పారు. ఏమైనా గ్లోబల్ ఐటీ రంగంలో హైదరాబాద్ పాత్రను మర్చిపోలేరన్నది మాత్రం నిజమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.