నెదర్లాండ్స్ రాజధాని హెగ్‌లో ఓ భవంతిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హైదరాబాద్ వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు నగరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.నగరంలోని ఆసిఫ్ నగర్‌కి చెందిన అబ్దుల్‌హదీ కొన్నేళ్లుగా నెదర్లాండ్స్‌లోని హెగ్‌లో నివసిస్తున్నాడు.
అతనికి నెదర్లాండ్‌కి సంబంధించిన పర్మినెంట్ వీసా ఉంది. కాగా 2022 జనవరి 5 రాత్రి హెగ్ నగరంలో అతడు నివసిస్తున్న ష్విల్డెర్‌షిజ్ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అందులో తీవ్ర గాయాలపాలైన అబ్దుల్ హదీని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 24 గంటల అనంతరం అతడు తుది శ్వాస విడిచాడు.
చివరిసారిగా అబ్దుల్ హాదీ 2021 జనవరిలో ఇండియా వచ్చాడు తిరిగి మార్చిలో నెదర్లాండ్స్ వెళ్లి పోయాడు. త్వరలోనే మళ్లీ ఇంటికి వస్తాను అని చెప్పి కొడుకు ఇంతలోనే తమకు శాశ్వతంగా దూరమయ్యాడని మృతుడి తండ్రి మహ్మద్ అహ్‌సాన్ కంటతడి పెట్టుకున్నారు. తమ కొడుకు మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా ఇండియాకి తరలించాలంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి, నెదర్లాండ్స్ ఇండియన్ ఎంబసీ అధికారులకి విజ్ఞప్తి చేశారు.