మెట్రో వర్గాల ఆవేదన

మెట్రో వర్గాల ఆవేదన

ప్రపంచ నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో అత్యాధునిక రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మెట్రోరైల్ సర్వీసు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడు కారిడార్లలో రోజుకు 820 ట్రిపుల ద్వారా 2లక్షల మందికి పైగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ప్రారంభమైన కొద్ది నెలలకే మంచి ఆదరణ దక్కడంతో మెట్రో అధికారులు, ప్రభుత్వం హర్షం వ్యక్తం చేశాయి. అయితే కోవిడ్ రూపంలో అనుకోని అవాంతరాలు మెట్రో ఆదాయాన్ని భారీగా దెబ్బతీశాయి. 2021 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మెట్రోకు రూ.386 కోట్ల ఆదాయం రాగా, నష్టం రూ.1,766 కోట్లు వచ్చినట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలిపాయి.

ప్రాజెక్టు కోసం పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ఏటా వడ్డీ కిందే రూ.1,412 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. గతంలో మాదిరిగా షాపింగ్‌ మాల్స్‌ నిర్వహణ సరిగా లేకపోవడం, యాడ్స్ ఆదాయం తగ్గడంతో నష్టాలు పెరుగుతున్నాయని ఎల్‌అండ్‌టీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం టికెట్లు, పార్కింగ్‌, షాపింగ్‌మాల్స్‌ ద్వారా అరకొరగా వస్తున్న ఆదాయం నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులకు కూడా సరిపోవడం లేదని పేర్కొంటున్నారు.

నష్టాలతో ఊబిలో చిక్కుకుపోయిన హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థను తమ వంతుగా ఆదుకుంటామని గతంలో చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రుణాల వడ్డీల చెల్లింపుల నిమిత్తం తక్షణ సాయంగా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లు అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అయితే ఇంతవరకు తమకు ఎలాంటి సాయం అందలేదని మెట్రో వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

దీంతో నిర్వహణ, వడ్డీల భారం మోయలేక సంస్థ సతమతమవుతోంది. కరోనా ఫస్ట్‌వేవ్‌కు ముందు ఎల్‌బీనగర్‌ – మియాపూర్‌, జేబీఎస్‌ – ఎంజీబీఎస్‌, నాగోలు – రాయదుర్గం కారిడార్లలో రోజుకు 3.80 లక్షల నుంచి 4.20 లక్షల మంది మెట్రోలో ప్రయాణించేవారు. దీంతో పాటుగా షాపింగ్‌మాల్స్‌ నిర్వహణ, ప్రకటనల ద్వారా భారీగా ఆదాయం సమకూరేది. మెట్రో టికెట్లు, మాల్స్‌ ప్రకటనల ద్వారానే ఏటా రూ.300 కోట్లకు పైగా ఆదాయం వస్తుండేది. ఇప్పుడు దానిలో సగం ఆదాయం కూడా రావడం లేదని అధికారులు చెబుతున్నారు.