లైంగిక దాడి, హత్యకు గురైన దిశ కేసులో విచారణ తరుణంలోనే… రేప్ కేసు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. బాధితులకు సత్వర న్యాయం అందించడానికి, నిందితుల్ని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ను ఏర్పాటు చేయడంతో పాటు…ఏడురోజుల కష్టడీకి అనుమతించడం, సీన్ రీకన్స్ట్రక్షన్ తరుణంలో…ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్పై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం,బీఎస్పీ అధినేత్రి మాయావతి హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులు.. హైదరాబాద్ పోలీసులను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు.
ఈ సందర్భంగా, యూపీ ప్రభుత్వం, పోలీసులపై మాయావతి విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ లో జంగల్ రాజ్ కొనసాగుతోందన్న మాయావతి..ఇక్కడ నేరగాళ్లను అతిథులుగా చూస్తున్నారని ఆరోపించారు. యూపీలో రోజు రోజూకీ నేరాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నప్పటికీ సర్కారు నిద్రపోతోందని ఆరోపించారు.
ఇదిలాఉండగా, ఎన్కౌంటర్పై నిర్భయ తల్లి ఆశా దేవీ స్పందించారు. తెలంగాణ పోలీసుల తీసుకున్న చర్యను స్వాగతిస్తున్నానని ఆమె తెలిపారు. నిందితులను ఎన్కౌంటర్ చేయడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ పోలీసులు గొప్ప విధి నిర్వహించారని, పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆశా దేవీ పేర్కొన్నారు. ఏడేళ్ల నుంచి తన కుమార్తె కోసం పోరాటం కొనసాగుతూనే ఉందన్నారు. నిర్భయ నిందితులను త్వరగా ఉరిశిక్ష విధించాలని ఆశాదేవీ డిమాండ్ చేశారు.