Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తన ప్రసంగాల్లోనూ, ట్విట్టర్ లో పెట్టే పోస్టుల్లోనూ తరచుగా తప్పులు చేస్తూ నెటిజన్లకు దొరికిపోతుంటారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్షపీఠాన్ని అధిరోహించనున్న యువరాజు పొరపాట్లపై ప్రతిపక్ష బీజేపీతో పాటు నెటిజన్లు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం ఇటీవల సహజంగా మారింది. తాజాగా నిత్యావసరాల ధరల పెరుగుదలపై పెట్టిన పోస్టులో ఒక తప్పు దొర్లడంతో ఎప్పటిలానే నెటిజన్లు, బీజేపీ నేతలు ఆయనపై వ్యంగాస్త్రాలు సంధించారు.
లెక్కలు కూడా సరిగ్గారాని రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలా అవుతారు అంటూ కామెంట్లు పెట్టారు. వీటిపై రాహుల్ గాంధీ స్పందించారు. తానూ మనిషినే అని తప్పులు చేయడం సహజమని ట్విట్టర్ లో సమర్థించుకున్నారు. నా బీజేపీ స్నేహితులందరికీ… నేనూ మనిషినే.. మనమంతా తప్పులు చేస్తాం..తప్పులు చేస్తుంటేనే జీవితం ఆసక్తికరంగా ఉంటుంది. నా తప్పును గుర్తించినందుకు ధన్యవాదాలు. నేనెప్పుడు తప్పుచేసినా ఇలాగే గుర్తిస్తూ ఉండండి. అది నన్ను నేను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుంది లవ్యూ ఆల్ అని ట్వీట్ చేశారు రాహుల్. మొత్తానికి తనపై వస్తున్న విమర్శలకు హుందాగా చెక్ పెట్టారు రాహుల్.