తెలుగులో కొన్ని సినిమాలు చేసి గ్లామర్ హీరోయిన్ గా నటించిన మోనాల్ గజ్జర్ ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రాల్లో మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా నటించింది. అహ్మదాబాద్ లో నివసించే మోనాల్ గజ్జర్ తన ఫ్రెండ్ డాక్టర్ రోహిత్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఉదయ్ పూర్ వెళ్లింది. పుట్టినరోజు వేడుకల్లో బాగా ఎంజాయ్ చేసిన మోనాల్ తిరిగి వస్తుండగా, ఉదయ్ పూర్ హైవేపై ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు పూర్తిగా తుక్కుతుక్కు అయ్యింది. ఆ సమయంలో కార్లో కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో మోనాల్ మెడకు బలమైన దెబ్బ తగిలినట్టు సమాచారం.
కారు పరిస్థితి చూస్తే అందులో ఎవరూ బతికి బట్టలేదని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ యాక్సిడెంట్ లో మోనాల్ మృతి చెందిందని విపరీతంగా ప్రచారం జరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన మోనాల్ కన్నుమూసిందని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మోనాల్ తన ఆరోగ్యంపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన ఈ సినీ తార… తాను చనిపోయినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేసింది. అయితే ఘటనలో కారు డ్యామేజ్ అయిన విధానం చూస్తే ఎవరూ బతికి బట్టకడతారని భావించరు. కారుకు సంబంధించిన పిక్స్ చూసి తాను మరణించినట్టు ప్రచారం చేసేశారని మోనాల్ గజ్జర్ ఆవేదన వ్యక్తం చేసింది. గత కొన్నాళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉంటున్న ఈ గుజరాతీ భామ సొంత భాషలో సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం దేవదాసి. మోనాల్ నటించిన రేవా అనే గుజరాతి చిత్రం సంచలనం విజయం సాధించడంతో ఆమె ఇకపై సొంత భాషకే పరిమితం అవ్వాలని నిర్ణయించుకుంది.