సాధారణంగా ప్రభుత్వం మారిన వెంటనే నామినేటెడ్ పోస్టులలో ఉన్నవారు రాజీనామా చేయడం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. కానీ తెలుగుదేశం నేత టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇప్పుడు రాజీనామా చేసేదే లేదని మొండికేయడం కాస్త ఆసక్తికరంగా మారింది. టిడిపి నేత పుట్టా సుధాకర్ యాదవ్ తాము స్వచ్చందంగా రాజీనామా చేయబోమని ప్రకటించారని సమాచారం. కావాలంటే ప్రభుత్వం రద్దు చేసుకోవచ్చని ఈ ఉదయం టీటీడీ బోర్డు సమావేశం కావాలని ముందే నిర్ణయించామని, కానీ అధికారులు హాజరుకాలేదని విమర్శించిన ఆయన, ఎవరు రాజీనామా చేసినా తాను మాత్రం చేయనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తమను నియమించిందని, తాము బోర్డులోకి వచ్చామని, తమ పదవీ కాలం ఇంకా ఉందని ఈ సందర్భంగా పుట్టా గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం బోర్డును రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న తరువాత మాత్రమే తాను పదవిని వీడుతానని ఆయన అన్నారు. స్వచ్ఛందంగా బోర్డును వీడేందుకు అత్యధిక సభ్యులు సుముఖంగా లేరని తెలిపారు. టిటిడి బోర్డు సమావేశం ఏర్పాటు చేయడం మీద విమర్శలు వచ్చినా చైర్మన్ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశాన్ని ఈవో సింఘాల్, జెఈఓ శ్రీ్నివాసరాజు లు బహిష్కరించారు. వారు లేకుండానే కొంతసేపు సమావేశాన్ని కొనసాగించి ఆ తర్వాత ముగించారు.