నాకు ఆ శక్తి ఉంటే ధోనీ వద్ద వాలిపోతా : చహల్

టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని తాను ఎంతగానో మిస్ అవుతున్నానని లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ తెలిపాడు. అదేవిధంగా తనకేగానీ.. అదృశ్య శక్తిగాని ఉంటే వెంటనే రాంచీలో ఉన్న మహీ ముందు వాలిపోయావాడిని అని అన్నారు. తాజాగా యశిక గుప్తా హోస్ట్‌గా వ్యవహరించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న ఈ లెగ్ స్పిన్నర్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

అదమంటే… ఓ అభిమాని తమరికి అదృశ్యమయ్యే శక్తి ఉంటే.. ఏం చేస్తావని ప్రశ్నించగా.. వెంటనే రాంచీలో ఉన్న ధోనీ వద్ద వాలిపోవాలని కోరుకుంటా అంటూ టక్ మని సమాధానమిచ్చాడు. అలాగే ఇతర క్రికెటర్లలా ధోనీని ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్స్‌లోకి తీసుకొచ్చే సత్తా తన ఒక్కడికే ఉందని అన్నాడు.

అంతేకాకుండా విమాన ప్రయాణాలు మొదలైన వెంటనే రాంచీకి వెళ్లి.. మహీ ఫ్యాన్స్ కోసం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ 24 గంటలు ఓపెన్ చేసి పెడ్తానని వివరించారు. ఇంకా ‘విమాన ప్రయాణాలు పునః ప్రారంభం అయిన వెంటనే.. రాంచీకి బయలుదేర్తాను. అక్కడికి వెళ్లి నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను 24 గంటలు తెరిచే ఉంచుతా. అప్పుడు ధోనీ ఎలా తప్పించుకుంటాడో చూస్తా.’ అంటూ చహల్ వెల్లడించారు. ఇక వికెట్ల వెనుకాల మహీ భాయ్.. తిత్లీ అని పిలిచే పిలుపు తానేంతో మిస్సవుతున్నానని వివరించాడు. అందుకు సంబంధించి అతని‌తో దిగిన ఓ ఫొటోను ఈ లెగ్ స్పిన్నర్ ట్వీట్ చేశాడు.

కాగా గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత మైదానానికి దూరమైన ధోనీ.. ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. అక్కడ సత్తాచాటి తద్వారా భారత జట్టులోకి రావాలని ఆశించాడు. లాక్‌డౌన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొన్నాడు. నెట్స్‌లో ఎన్నడూ లేని విధింగా కీపింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కానీ కరోనాతో ఈ క్యాష్ రిచ్ లీగ్ నిరవధికంగా వాయిదా పడటంతో అతని అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి.