అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ప్రచారం కోసం నిధులు సేకరణ కోసం బోస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి బైడెన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీలో లేకపోతే, తాను కూడా పోటీ చేయకపోవచ్చని బైడెన్ సంచలన కామెంట్స్ చేశారు. కానీ దేశం కోసం ఆయణ్ను మాత్రం గెలవనివ్వమని తెలిపారు.
ప్రస్తుత, మాజీ అధ్యక్షులు అయిన బైడెన్, ట్రంప్.. తాము ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్నామని ప్రకటించారు. ఇప్పటికే అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా నిలిచిన బైడెన్‌కు ఓటర్లు మరోసారి అవకాశం ఇస్తారా అన్నదానిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో బైడెన్ వయసు అంశం ప్రధానం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన మళ్లీ పోటీ చేసి గెలిసితే పదవీకాలం పూర్తి చేసేనాటికి 86 ఏళ్లకు చేరుకోనున్నారు.
2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ట్రంప్ గెలిస్తే, అమెరికా నిరంకుశ పాలనలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన ప్రత్యర్థులు ఇప్పటికే ఘోర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాను మరోసారి అధ్యక్షుడినైతే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు మాత్రమే నియంతగా ఉంటానని ఆ తర్వాత మారతానని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.