ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) బిల్లులో మహిళల రక్షణ కోసం మరింత పటిష్టమైన చట్టాలను రూపొందించినట్లు హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. మహిళలకు అన్యాయం చేసే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించేలా మార్పులు చేసినట్లు తెలిపారు. మోసపూరిత పెళ్లిళ్లను నిరోధించేందుకు, లైంగిక దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి చట్టాలు చేశామన్నారు.
పెళ్లి కోసం వ్యక్తిగత గుర్తింపు (మతం) దాచిపెట్టడం లేదా తప్పుగా చెప్పడం నేరమని, ఈ నేరానికి పాల్పడిన పురుషుడికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధించవచ్చని భారతీయ న్యాయ సంహిత బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. అదేవిధంగా పెళ్లి చేసుకుంటాననే హామీతో కానీ, ఉద్యోగం ఇస్తానని, ప్రమోషన్ ఇస్తామనే హామీలతో కానీ లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని కూడా శిక్షించదగిన నేరమేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేరానికి బీఎన్ఎస్ లో పదేళ్లు శిక్షతో పాటు జరిమానా కూడా విధించేలా మార్పులు చేసింది.