ఉత్తర కొరియాని ఐరాస హెచ్చరించినా, పట్టించుకోకుండా తాను అనుకున్న పనిని మరోసారి చేసింది. ఆత్మరక్షణ పేరుతో నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రెండుసార్లు విఫలమైన ఉత్తర కొరియా.. మూడోసారి ఉపగ్రహ ప్రయోగంలో సఫలమైంది. తమ నూతన కొల్లిమే-1 రాకెట్ యల్లిజోయాంగ్-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఉత్తరకొరియా అంతరిక్ష సంస్థ వెల్లడించింది. అయితే పొరుగుదేశాలు, అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఉత్తర కొరియా చేసిన ఈ పని ఐక్య రాజ్య సమితిని కలవర పెడుతోంది.
ఐక్యరాజ్యసమితి అయితే క్షిపణి పరిజ్ఞానం పరిధిలోకి వస్తుందనే కారణంతో ఉత్తర కొరియా ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టకుండా ఇప్పటికే నిషేధం విధించింది. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ఉపగ్రహ ప్రయోగం చేపట్టే హక్కు తమకుందని చెబుతూ ఉత్తర కొరియా ఈ ప్రయోగం చేపట్టింది. శత్రు సైనికుల ప్రమాదకర కదలికలను కనిపెట్టి యుద్ధానికి సిద్ధమయ్యేందుకు తమకు నిఘా ఉపగ్రహం ఉపకరిస్తుందని తెలిపింది.