జగన్ అనే నేను ….మరి కాసేపట్లోనే…అంతా జగన్ మార్క్

I'm Jagan .... and it is in few minutes

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. భారీ మెజార్టీతో సాధారణ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన జగన్‌ మరోకొడ్డి గంటల్లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మధ్యాహ్నం 12.23 గంటల ముహూర్తానికి  గవర్నర్‌ నరసింహన్‌  వైఎస్‌ జగన్‌ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సీఎం కేసీఆర్‌, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ హాజరుకానున్నారు. మరో వైపు జగన్‌ ప్రమాణ స్వీకారానికి కార్యకర్తలు, ప్రజలు భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 5 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం మరో మార్గాన్ని నిర్దేశించారు. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఇక తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నా.. వైఎస్‌ జగన్‌ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా.. ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. అనవసర ఖర్చులకు పోకుండా సింపుల్‌గా ఏర్పాట్లు ఉండాలని వైఎస్‌ జగన్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఐదు కోట్లు ఖర్చు చేసిన నేపధ్యలో జగన్ ఇక్కడి నుండే ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అటు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే వారి కోసం దాదాపు 10 వేల 500 పాస్‌ లను జారీ చేయనున్నారు. ఈ పాసులను పలు కేటగిరీలలో పంపిణీ చేశారు. ఇవీ కాకుండా ప్రెస్‌ పాసులను అదనంగా జారీ చేశారు. గవర్నర్‌ తొలుత సీఎంగా జగన్‌ చేత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఎన్నికల్లో  వైసీపీ కి ప్రజలు అందించిన గెలుపుకు ధన్యవాదాలు తెలపడంతో పాటు తమ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు వివరించనున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి కూడా  వైఎస్‌ జగన్‌ చెప్పే అవకాశమున్నదని వైసీపీ పార్టీ వర్గాలు తెలిపాయి.