Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డోక్లామ్ వివాదాన్ని వదిలిపెట్టడం చైనాకు ఇష్టంగా ఉన్నట్టు లేదు. 73 రోజుల ఉద్రిక్తత తర్వాత ప్రశాంతంగా ముగిసిన సమస్యను మళ్లీ కెలుకుతోంది. చైనా స్వభాగం గ్రహించిన భారత్ కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సిక్కిం, భూటాన్, టిబెట్ ట్రై జంక్షన్ అయిన డోక్లాంలో చైనా భారీగా సైన్యాన్ని మోహరించింది. దాదాపు 1600-1800 మంది చైనా సైనికులు అక్కడ తిష్టవేశారు. గడ్డ కట్టే చలిలో రెండు హెలిప్యాడ్లు, గుడిసెలు, స్టోర్లు ఏర్పాటుచేసుకుని మరీ డోక్లాంలో ఉంటున్నారు చైనా సైనికులు. ఈ విషయాన్ని భారత సైనిక బలగాలు ధృవీకంరించినట్టు తెలుస్తోంది. చైనా సైనికులు అక్కడ ఉండడమే కాకుండా..రహదారి నిర్మాణం కూడా సాగిస్తున్నట్టు సమాచారం. గతంలో భారత్ చైనా సైన్యాన్ని అడ్డుకున్న డోక్లాం దక్షిణ ప్రాంతమైన ఝంపేరి రిడ్జ్ దగ్గర ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీనిపై భారత్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. వివాదాస్పదమైన డోక్లాంను చైనా, భూటాన్ తమ ప్రాంతంగా చెప్పుకుంటాయి.
భూటాన్ తో రక్షణ ఒప్పందాలమేరకు భారత్ అక్కడ సైనికులను మోహరించింది. సాధారణంగా ఆ ప్రాంతంలో చైనా సైనికులు పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. ఈ చర్యకు భారత్ ఎలాంటి అభ్యంతరాలూ చెప్పేది కాదు. కానీ ఈ ఏడాది జూన్ లో మాత్రం చైనా అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి అక్కడ రోడ్డునిర్మాణాలు చేపట్టడడంతో భారత్ అడ్డుతగిలింది. దీంతో ఇరు దేశాల మధ్య డోక్లాం ప్రతిష్టంభన ఏర్పడి అంతర్జాతీయంగా సంచలనం కలిగించింది. ఒక దశలో యుద్ధం తప్పదన్న సంకేతాలూ వచ్చాయి. అయితే మొదటి నుంచీ ఈ సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రయత్నించిన భారత్ చివరికి అనుకున్నది సాధించింది. ప్రధాని మోడీ చైనా పర్యటనకు ముందు ఇరుదేశాల సైనికులు వివాదాస్పద ప్రాంతం నుంచి వైదొలిగారు. అప్పటినుంచి ప్రశాంతంగా ఉన్న డోక్లాం వద్ద చైనా మళ్లీ వివాదాస్పదంగా వ్యవహరిస్తోంది. అయితే సైన్యం మోహరింపుపై చైనా తన వాదన వివరించింది. చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రతీ ఏటా వేసవి, శీతాకాలంలో డోక్లాంలో క్యాంపులు నిర్వహించడం సహజమని, ఎప్పటిలానే ఈ ఈ ఏడాది శీతల క్యాంపు పెట్టామని చెబుతోంది. భారత్ మాత్రం చైనా చర్యలను ఓ కంట కనిపెడుతోంది.