తెలంగాణలో కామన్ పరీక్షలన్నీ వాయిదా

తెలంగాణలో రోజురోజుకీ చాలా తీవ్రంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఈనెలాఖరు వరకు లాక్ డౌన్ ను ప్రకటించారు. ఇంతటి వైరస్ తీవ్రతలో యథావిథిగా ఈ నెలాఖరు వరకు వారి వారి ఇళ్లలోనే ఉండాలని ప్రజలను కోరారు.
అదేవిధంగా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తెలంగాణలో మే నెలలో జరగాల్సిన అన్ని కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లను వాయిదా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎంసెట్‌ తో పాటు మే నెలలో జరగాల్సిన ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తాజాగా ప్రకటించింది. అయితే త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కొత్త తేదీలను ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. అలాగే… ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు మే 5 వరకు గడువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ఇక కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ల దరఖాస్తు గడువు వచ్చే నెల 5 వరకు పొడిగించినట్టు కూడా ఆయన పేర్కొన్నారు. కాగా ప్రభుత్వంతో సంప్రదించి తర్వాత సెట్ తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించనుందని పాపిరెడ్డి వివరించారు.