టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ అసెంబ్లీలో కలకలం రేపాయి. ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే గురువారం శాసనసభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ను ఆయన స్థానంలో కూర్చోబెట్టడానికి సీఎం జగన్, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు తోడుగా వెళ్లారు. అచ్చెన్నాయుడు వెళ్లడాన్ని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తప్పుపట్టారు. స్పీకర్ చైర్ వరకు ప్రతిపక్షనేత చంద్రబాబు రాకుండా బంట్రోతును పంపారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. చెవిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. చంద్రబాబు బంట్రోతును పంపించారన్న మాట సరైనదా అని అచ్చెన్నాయుడు వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. ‘‘మేం ఎమ్మెల్యేలమా? బంట్రోతులమా స్పీకర్ చెప్పాలి. నేను చంద్రబాబు బంట్రోతునైతే.. వైసీపీ సభ్యులంతా జగన్ బంట్రోతులేనా’’ అని అచ్చెన్నాయుడు మరోసారి సూటిగా ప్రశ్నించారు. అయితే భాస్కర్‌రెడ్డికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. చెవిరెడ్డి వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర సభ్యులు తప్పుబట్టారు. చెవిరెడ్డి, అచ్చెన్నాయుడుకు క్షమాపణ చెప్పాలని ఓ దశలో టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అచ్చెన్నాయుడును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని సీతారం నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబు అభ్యర్థనపై స్పీకర్ స్పందించారు. రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ప్రకటించారు.