పెంచిన పింఛన్లు నేటినుంచే

increased aasara pensions

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు శనివారం నుంచి అమలుకానున్నది. పెరిగిన పింఛన్లను లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లుచేశారు. పెరిగిన పింఛన్ ప్రకారం వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, బోధకాలు బాధితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు రూ.2,016 చొప్పున, వికలాంగులకు రూ.3,016 చొప్పున అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 38,99,044 మంది లబ్ధిదారులను అర్హులుగా పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గుర్తించింది. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీచేసేందుకు రూ.863.24 కోట్లు ఇప్పటికే జిల్లాలకు పంపిణీచేశారు. బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు శనివారం నుంచి వారి అకౌంట్లలో జమవుతాయి. పోస్టాఫీసు ద్వారా పింఛను పొందేవారికి సోమవారం నుంచి పంపిణీ జరుగుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో శనివారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెరిగిన పింఛన్ మంజూరుపత్రాలను లబ్ధిదారులకు అందజేస్తారు.