రెండు రోజులూ వర్షం పడితే.. టీమిండియా నేరుగా ఫైనల్‌కే..!

india directly to the final if rain fall two days

ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ మొదటి సెమీ ఫైనల్ రేపు మాంచెస్టర్‌లో జరగనున్న విషయం విదితమే. ఆ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌లు తలపడనున్నాయి. అయితే రేపు మాంచెస్టర్‌లో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించవచ్చని బ్రిటన్ వాతావరణ శాఖ చెబుతోంది. రేపు మ్యాచ్ జరిగే సమయంలో తేలికపాటి జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రేపు జరిగేది సెమీ ఫైనల్ కనుక దానికి ఎలాగూ బుధవారం రిజర్వ్ డే ఉంది. ఈ క్రమంలో రేపు వర్షం కారణంగా ఆటను కొనసాగించలేకపోతే.. బుధవారం రోజున అక్కడి నుంచే ఆటను ప్రారంభిస్తారు. అయితే రేపటి కన్నా బుధవారమే ఇంకా ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో వరుసగా రెండు రోజులూ వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే పరిస్థితి ఏమిటని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఒక వేళ రెండు రోజులూ వర్షం కారణంగా ఆట జరగకపోతే అభిమానులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన పనిలేదు. అది టీమిండియాకే లాభం. ఎలాగంటే.. వర్షం వల్ల రెండు రోజులూ ఆట జరగకుండా మ్యాచ్ రద్దయితే.. లీగ్ దశలో అధిక పాయింట్లు సాధించిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఈ లెక్కన చూస్తే.. భారత్, న్యూజిలాండ్ జట్లలో భారత్‌కు అధిక పాయింట్లు (15) ఉన్నాయి కనుక.. టీమిండియానే ఫైనల్‌కు వెళ్తుంది. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్ టై అయితే మాత్రం సూపర్ ఓవర్ ద్వారా విన్నర్‌ను నిర్ణయిస్తారు.