ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ కరోనా. ఈ మహమ్మారి బారిన పడ్డ భారతీయుల సంఖ్య ఇప్పుడు 500 దాటింది. దీన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. కరోనా మహమ్మారిపై వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండవసారి ప్రసంగిస్తూ… జనతా కర్ఫ్యుని ప్రతిఒక్కరూ విజయవంతం చేయటమే కాక చాలా బాధ్యతగా వ్యవహరించారని స్పష్టం చేశారు. అదేవిధంగా.. దేశమంతటా మరో మూడు వారాల పాటు లాక్ డౌన్ చేస్తున్నట్లు మోడీ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు.
అయితే దేశం మొత్తం లాక్ డౌన్ చేస్తున్న ఈ తరుణంలో దాని ప్రాధాన్యతను వివరిస్తూ.. లాక్ డౌన్ అంటే కర్ఫ్యూలాంటిదని.. ప్రజలు అలాంటి నిబంధనలను ఉల్లంఘించటం సరికాదని మోడీ తెలియజేశారు. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాకూడదని ఆయన వివరించారు. 21 రోజులు ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ కి సహకరించాలని మోడీ కోరారు. ఈ కీలకమైన 21రోజులల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని.. ఇదే అసలైన పరిష్కారమని మోడీ వివరించారు. ఈ 21 రోజుల లాక్ డౌన్ చర్యలు.. ఈ రోజు అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయని మోడీ అన్నారు. కాగా కేంద్ర ఆరోగ్యశాఖకు అత్యవసరంగా రూ.15వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు మోడీ తెలియజేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై, వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని మోడీ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలను పాటించడం అనే ఈ ఒక్క మార్గమే ఈ మహమ్మారిని తుడిచి వేసేందుకు సహకరిస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.