అనుకున్నంతా అయింది…. ద‌క్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన భార‌త్

India lost to the Test series by South Africa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భ‌య‌ప‌డిందే జ‌రిగింది. మ‌న క్రికెట‌ర్లు ఉప‌ఖండం పులులు మాత్ర‌మే అని మ‌రోసారి తేలిపోయింది. చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తామంటూ ద‌క్షిణాఫ్రికా గడ్డ‌పై అడుగుపెట్టిన కోహ్లీసేన పాత క‌థ‌నే పున‌రావృతం చేసింది. ద‌క్షిణాఫ్రికాలో మ‌రోసారి టెస్ట్ సిరీస్ లో ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది. సెంచూరియ‌న్ లో జ‌రిగిన రెండో టెస్టులో ఓట‌మి ద్వారా భార‌త్ 2-0తో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఉప‌ఖండం వెలుప‌ల భార‌త్ ఎంత బ‌ల‌హీన‌మైన జ‌ట్టో రెండో ఇన్నింగ్స్ చూస్తే అర్ధ‌మవుతుంది. 287 ప‌రుగుల విజ‌యల‌క్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భార‌త జ‌ట్టు అత్యంత పేల‌వ‌మైన బ్యాటింగ్ చేసింది. భీక‌ర బ్యాట్స్ మెన్ ఉన్న జ‌ట్టుగా పేరొందిన టీమిండియా 151 ప‌రుగుల‌కు ఆల‌వుటయింది. అంద‌రూ వ‌ద్దంటున్నా జ‌ట్టులో జోటు ద‌క్కించుకున్న రోహిత్ శ‌ర్మ 47 ప‌రుగులు చేయ‌డం వ‌ల్లే భార‌త్ కు ఆ మాత్రం గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర‌యినా ద‌క్కింది. కెప్టెన్ కోహ్లీ దారుణ‌మైన ఫామ్ కొన‌సాగిస్తున్నాడు. కేవ‌లం ఐదంటే ఐదు ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

ముర‌ళీ విజ‌య్ 9, లోకేశ్ రాహుల్ 4, పుజారా 19, హార్దిక్ పాండ్య 6, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 3, షమీ 28, ఇషాంత్ శ‌ర్మ 4, బుమ్రా 2 ప‌రుగులు చేశారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో ఎన్గిడీ 6 వికెట్లు తీయ‌గా ర‌బ‌డా 3 వికెట్లు తీశాడు. కేప్ టౌన్ టెస్ట్ ఘోర ఓట‌మితో సెంచూరియ‌న్ లో భార‌త జ‌ట్టు క‌సిగా ఆడి బ‌దులు తీర్చుకుంటుంద‌ని అభిమానులు ఆశ‌లు పెట్టుకోగా…ఆట‌గాళ్లంద‌రూ అత్యంత బాధ్య‌తారాహిత్య‌మైన ఆట‌తీరుతో నిరాశ‌ప‌రిచారు. ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 335 ప‌రుగులు చేయ‌గా భార‌త్ 307 ప‌రుగుల‌కు ఆల‌వుట‌యింది. రెండు జ‌ట్ల స్కోర్ మ‌ధ్య పెద్ద తేడాలేక‌పోవ‌డంతో భార‌త్ గెలవ‌గ‌ల అవ‌కాశం ఉంద‌న్న అంచనాలు వెలువ‌డ్డాయి. స‌ఫారీలు రెండో ఇన్నింగ్స్ లో 258 ప‌రుగులు చేయ‌డంతో భార‌త్ విజ‌యంకోసం 287 ప‌రుగులు చేయాల్సివ‌చ్చింది. అయితే ఏ ద‌శ‌లోనూ భార‌త బ్యాట్స్ మెన్ విజ‌యంపై ఆశ‌లు క‌ల్పించ‌లేదు. వ‌రుస‌గా ప‌దోసిరీస్ గెలిచి కొత్త రికార్డు సృష్టించాల‌నుకున్న కోహ్లీ సేన మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్ కోల్పోయింది.