1000 కోట్ల భీముడు, 300 కోట్ల కర్ణుడు… కొత్త కోణంలో పురాణ పాత్రలు.

Mohanlal 1000 cr Mahabharata film and Vikram Mahavir Karna 300 cr film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
వెయ్యి కోట్ల భీముడు ఏంటి ? 300 కోట్ల కర్ణుడు ఏంటి ? మహాభారతంలోని ఆ ఇద్దరితో 500 కోట్ల రాముడంటూ పోలికేంటి ? ఏమీ అర్ధం కావడం లేదా ? అక్కడికే వస్తున్నాం. ఇందులో అర్ధం కాకపోవడానికి ఏమీ లేదు. ఆయా పౌరాణిక పాత్రలు కేంద్రంగా రాబోతున్న భారీ సినిమాలు, వాటి బడ్జెట్లు అవి. బాహుబలి కి పెట్టిన ఖర్చు, వచ్చిన కలెక్షన్స్ బేరీజు వేసుకున్నాక భారతీయ భాషల్లో భారీ చిత్రాలకు మార్కెట్ ఉంటుందన్న ధైర్యం వచ్చింది ఫిలిం మేకర్స్ లో. అయితే ఆ స్థాయికి తగ్గ సబ్జక్ట్స్ తయారీ కోసం ఎక్కడెక్కడో కష్టపడడం కన్నా జనానికి చిరపరిచితం అయిన పౌరాణిక పాత్రల వైపు మొగ్గుతున్నారు.

Mohanlal 1000 cr Mahabharata film details

ప్రముఖ వ్యాపారవేత్త బీఆర్ శెట్టి నిర్మాతగా మలయాళ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎంటీ వాసుదేవ నాయిర్ రాసిన “రండ మూజ” అనే నవల ఆధారంగా భీముడు ప్రధాన పాత్రగా ఓ సినిమా రాబోతోంది. వీఏ శ్రీకుమార్ మీనన్ డైరెక్ట్ చేసే ఈ సినిమా బడ్జెట్ వెయ్యి కోట్లు. ఇందులో భీముడు పాత్రని మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పోషించబోతున్నారు. కర్ణ పాత్రలో తెలుగు హీరో అక్కినేని నాగార్జున కనిపించే అవకాశం వుంది. వెయ్యి కోట్లతో పదేపదే చూసిన, విన్న మహాభారతాన్ని ఇంకా కొత్తగా ఏమి చూపిస్తారు ? అది కూడా భీముడు కేంద్రబిందువుగా అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్టే. వాసుదేవ నాయిర్ స్వయంగా స్క్రిప్ట్ సమకూరుస్తున్న ఈ కథ ఇప్పటిదాకా భారతీయ ప్రేక్షకులు చూడని దృక్కోణం నుంచి ఉంటుంది. ఇందులో పాండవుల పాత్రల్ని వాస్తవిక ధోరణికి అతి దగ్గర చిత్రీకరిస్తారట. ఇక 18 పర్వాలున్న మహాభారతంలోని 17 వ పర్వం అయిన మహాప్రస్థానిక పర్వం నుంచి ఈ కథ మొదలవుతుంది. పరీక్షిత్ కి పట్టాభిషేకం చేసిన పాండవులు హిమాలయాలవైవుగా సరిపోవడంతో మొదలయ్యే ఈ కథ మొత్తం భీముని దృక్కోణంలో ఉంటుంది. ధర్మజుడు కన్నా వయస్సులో, అర్జునుడు కన్నా కీర్తిలో చిన్నవాడైన భీముడు ఆలోచనల్ని సరికొత్త కోణంలో చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ ని వెయ్యి కోట్లతో రెండు భాగాలుగా తీస్తున్నారు. తొలి భాగం వచ్చిన 90 రోజుల్లో రెండో భాగం రిలీజ్ చేయాలని ప్లాన్. అంతా అనుకున్నట్టు సవ్యంగా సాగితే ఈ వెయ్యి కోట్ల భీముడు 2020 లో ప్రేక్షకుల ముందుకు వస్తాడు.

Vikram Mahavir Karna 300 cr film
ఇక 300 కోట్లతో కర్ణుడు కూడా త్వరలో సెట్స్ మీదకు రాబోతున్నాడు. మలయాళ దర్శకుడు ఆరెస్ విమల్ రెండేళ్లుగా ఈ స్క్రిప్ట్ మీద పని చేశారు. యునైటెడ్ ఫిలిమ్స్ రూపొందించే ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు. “ మహావీర్ కర్ణ “ పేరుతో వస్తున్న ఈ సినిమాలో హీరో విక్రమ్. దానానికి మారు పేరైన కర్ణుడు అధర్మానికి పాల్పడుతున్న కౌరవుల వైపు ఎందుకు వున్నాడు, ఆయన జీవితంలో ఏమి జరిగింది అనే కోణంలో ఈ చిత్ర కథ వుండే అవకాశం ఉందట. కర్ముడు గురించి ఇవన్నీ తెలిసిందే కదా అనుకోవచ్చు. కర్ణుడు మీద సినిమా అని దర్శకుడు విమల్ చెప్పినప్పుడు హీరో విక్రమ్ కూడా ఇలాగే అనుకున్నారట. ఎన్టీఆర్, శివాజీ గణేశన్ ఇప్పటికే కర్ణుడు మీద సినిమాలు చేశారు అంతకన్నా గొప్ప విషయం ఏమి మిగిలివుంది అని అడిగారట. అయితే విమల్ కర్ణుడు గురించి తన దృక్కోణాన్ని ఆవిష్కరించినప్పుడు విక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఓకే చెప్పారట. కర్ణుడి అంతరంగాన్ని సరికొత్త కోణంలో చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం. మొత్తానికి బడ్జెట్ పెంచడం ఒక ఎత్తు అయితే పురాణ పాత్రల్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించడం ఇంకో ఎత్తు. ఒకే సినిమాతో ఆ రెండు సవాళ్ళని ఎదుర్కొంటున్న ఈ చిత్ర యూనిట్స్ కి ముందుగానే అభినందనలు చెబుదామా !