Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విరుష్క పెళ్లి నేపథ్యంలో బాలీవుడ్, క్రికెట్ బంధంపై మరోసారి ఆసక్తికర చర్చ జరుగుతోంది. కోహ్లీ-అనుష్క కన్నా ముందు ఎందరో క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వారిలో కొన్ని జంటలు పెళ్లిపీటలెక్కగా… మరికొన్ని జంటలు మనస్ఫర్ధలతో విడిపోయి వేరే వారిని వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. పాత తరం క్రికెటర్ల విషయానికొస్తే… మొదటగా చెప్పుకోవాల్సింది మన్సూర్ ఆలీఖాన్ పటౌడీ, షర్మీలాఠాగూర్ గురించే. ఘనమైన నేపథ్యం నుంచి వచ్చిన పటౌడీ ఓ హీరోయిన్ ను ప్రేమించడం, పెళ్లిచేసుకోవడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. భారత్ లో బాలీవుడ్, క్రికెట్ బంధం మొదలయింది వారిద్దరినుంచే. వారిది అత్యంత విజయవంతమైన బంధం కూడా. అలాగే నీనాగుప్తా అనే బాలీవుడ్ నటి… వెస్టెండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో సహజీవనం చేసి ఓ కుమార్తెను కూడా కన్నారు.
ఆ తర్వాత 1980ల్లో భారత కెప్టెన్ కపిల్ దేవ్… బాలీవుడ్ హీరోయిన్ సారిక మధ్య చాలా రోజులు ప్రేమాయణం నడిచింది. అప్పట్లో వారిద్దరి బంధం పత్రికల్లో ప్రముఖంగా వచ్చేది. కానీ ఏ కారణాల వల్లో వారు విడిపోయారు. తర్వాత కపిల్ రోమీ భాటియాను వివాహం చేసుకోగా, సారిక దక్షిణాది నటుడు కమల్ హాసన్ ను పెళ్లిచేసుకున్నారు. అలాగే 1980ల్లో ప్రముఖంగా వార్తల్లో నానిన మరో బాలీవుడ్, క్రికెట్ జంట రవిశాస్త్రి, అమృతా సింగ్. రవి ఆడే మ్యాచ్ లన్నింటికి అమృత హాజరయ్యేవారు. రవిని అమృత బహిరంగంగా ముద్దుపెట్టుకోవడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ వారి ప్రేమ ఎక్కువరోజులు సాగలేదు. అమృత బాలీవుడ్ నటుడు. తన కన్నా ఏడేళ్ల చిన్నవాడైన సైఫ్ అలీఖాన్ ను వివాహం చేసుకోగా… రవిశాస్త్రి రీతూ సింగ్ ను పెళ్లాడాడు. కానీ ఈ రెండు పెళ్లిళ్లు విఫలమయ్యాయి. అమృత సైఫ్ నుంచి విడిపోగా… రవిశాస్త్రి వివాహం కూడా విడాకులతో ముగిసిపోయింది.
తర్వాతి తరానికి చెందిన క్రికెటర్లలో సౌరవ్ గంగూలీ పెళ్లయిన తరువాత… హీరోయిన్ నగ్మాతో ప్రేమాయణం నడపడం వివాదాస్పదంగా మారింది. 1999 వరల్డ్ కప్ సమయంలో లండన్ లో వారిద్దరూ కలిసి కనిపించడంతో వారిపై పుకార్లు మొదలయ్యాయి. గంగూలీ కెప్టెన్ అయిన తరువాత కూడా వారి వ్యవహారం సాగింది. 2002లో శ్రీకాళహస్తి వచ్చి సర్పదోష నివారణ పూజ చేయించుకుంటూ వారిద్దరూ మీడియా కంటికి చిక్కడం సంచలనం సృష్టించింది. గంగూలీ నగ్మాను ద్వితీయ వివాహం చేసుకున్నట్టు కూడా వార్తలొచ్చాయి కానీ వారిద్దరూ ఖండించారు. తర్వాత ఆ బంధం ముగిసిపోయింది. పాత తరం క్రికెటర్లతో పోలిస్తే… ఈ తరం క్రికెటర్లలో ఎక్కవమంది బాలీవుడ్ భామలతో ప్రేమాయణం సాగించారు.
ఇటీవల నటి సాగరిక ఘట్గేను వివాహం చేసుకున్న మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, అంతకుముందు ఇషా శర్వాణితో సుదీర్ఘ కాలం ప్రేమాయణం నడిపాడు. 2005లో మొదలైన వీరి స్నేహం ఎనిమిదేళ్లపాటు సాగి 2013లో ముగిసిపోయింది. ఇక పెళ్లే తరువాయి అనుకుంటున్న తరుణంలో వారిద్దరూ విడిపోవడం తీవ్ర చర్చనీయాంశమయింది. నాలుగేళ్ల తర్వాత జహీర్ మరో బాలీవుడ్ నటినే ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అలాగే స్నిన్నర్ హర్భజన్ సింగ్ కూడా హీరోయిన్ గీతాబస్రాతో సుదీర్ఘకాలం ప్రేమాయణం నడిపాడు. 2015లో పెళ్లిచేసుకున్న వీరిద్దరూ ఓ పాపతో సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు.
ఒకప్పుడు టీమిండియాలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న యువరాజ్ సింగ్ కూడా క్రికెట్ లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే బాలీవుడ్ హీరోయిన్ కిమ్ శర్మతో ప్రేమలో పడ్డాడు. వారిద్దరికీ పెళ్లిచేసేందుకు యువీ కుటుంబ సభ్యులు అంగీకరించారు కూడా. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారు. యువరాజ్ గత ఏడాది హజల్ కీచ్ ను వివాహ మాడాడు. భారత జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరుతెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ కూడా బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. బాలీవుడ్ లో అడుగుపెడుతూనే సంచలనంగా మారిన దీపికా పదుకునే పై ధోనీ ఎంతో ఆసక్తి కనబర్చాడు. అయితే అదే సమయంలో యువరాజ్ కూడా సీన్ లోకి ఎంటరయి దీపిక ను తనవైపు ఎట్రాక్ట్ చేసుకున్నాడని, దీంతో ధోనీ పక్కకు తప్పుకున్నాడని చెప్పుకుంటారు. అయితే దీపిక యువరాజ్ తో కూడా ఎక్కువ కాలం ప్రేమ వ్యవమారం నడపలేదు. రణ్ బీర్ కపూర్ తో ప్రేమ కోసం దీపిక యువరాజ్ కు దూరం జరిగింది.
దీపిక తర్వాత ధోనీ… దక్షిణాది నటి లక్ష్మీరాయ్ తో ప్రేమాయణం సాగించాడు. వారిద్దరూ కొన్నాళ్లు డేటింగ్ కూడా చేశారు. ధోనీ కెప్టెన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కు లక్ష్మీ రాయ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి ధోనీనే కారణం. రెండేళ్లపాటు వారి ప్రేమ వ్యవహారం నడిచింది. తర్వాత వారిద్దరూ విడిపోయారు. 2010లో ధోనీ సాక్షిసింగ్ ను పెళ్లిచేసుకున్నాడు. ఇలా తొలినుంచీ… బాలీవుడ్, క్రికెట్ మధ్య విడదీయలేని బంధం ఉంది. విరుష్క జోడీ తమ పెళ్లితో మరోమారు ఆ విషయాన్ని నిరూపించింది.