అమెరికాలో మృతి చెందిన భారతీయ కోటీశ్వరుడు

అమెరికాలో మృతి చెందిన భారతీయ కోటీశ్వరుడు

అమెరికాలో మరో భారతీయుడు కన్నుమూశారు. యూఎస్‌లో డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ నిర్వహిస్తున్న భారత సంతతికి చెందిన మిలియనీర్ తుషార్ అట్రే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన గర్ల్ ఫ్రెండ్ కి చెందిన కారులోనే కిడ్నాప్ చేసి హత్య చేయడం సంచలనంగా మారింది. తుషార్ అట్రే కిడ్నాప్, హత్యకు సంబంధించిన కారణాలు విశ్లేషించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని షరిఫ్ కార్యాలయం ఫేస్‌బుక్ కథనంలో వెల్లడించింది.

తుషార్ అట్రే కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. కొందరు దుండగులు తుషార్ అట్రే నివాసంలోకి చొరబడి, తుషార్ను అతడి స్నేహితురాలికి చెందిన బీఎండబ్ల్యూ కారులో ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో కేసు నమోదు చేసిన కాలిఫోర్నియా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కొండలు, దట్టమైన అటవీ ప్రాంతానికి సమీపంలోని తుషార్ అట్రేకు చెందిన స్థలంలో బీఎండబ్ల్యూ కారుతోపాటు ఆయన మృతదేహాన్ని గుర్తించారు.  తుషార్ అట్రే కిడ్నాప్, హత్య కేసులో కనీసం ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్నట్లు పేర్కొంది.

కాగా, సోషల్‌మీడియాలో చురుకుగా ఉండే తుషార్ అట్రేకు సర్పింగ్ అంటే చాలా ఇష్టమని గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు చూస్తే అతడికి సాహసాలు చేయడం ఇష్టమని, ప్రకృతి ప్రేమికుడని తెలుస్తోంది. ఇటీవలే తుషార్ అట్రే ఇంటి నుంచి బీఎండబ్ల్యూ కారు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును లోతుగా అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు.