మోడీ అచ్చేదిన్ మనకి కాదు…వాళ్ళకే !

గత ఎన్నికల్లో గెలవడానికి మోడీ ప్రయోగించిన మాటల మంత్రాలలో ప్రధానమైనది అచ్చేదిన్, తనని గెలిపిస్తే రాబోయేదంతా అచ్చేదిన్ అని ఊదరగొట్టారు. దాదాపు పదేళ్ళ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారో ? లేక మోడీ మంత్రానికి ముగ్ధులయ్యారో కానీ గంపగుత్తగా మోడీకి వోట్లు గుద్దేశారు. ఆయన మరో ప్రధాన హామీ నల్లదనాన్ని వెనక్కి రప్పిస్తానని, అందుకోసమే ప్రత్యేక ప్రణాళిక ఆలోచించి మరీ నోట్ల రద్దు చేసారని మోడీ సానుభూతిపరులు వాదిస్తూ ఉంటారు. అయితే నల్లధనాన్ని అరికట్టడానికి మోదీ ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ అవేవి ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా.. మమ్మల్నేం చేస్తాయిలే అన్న ధీమా కాబోలు నల్లధనాన్ని వెనక్కి తేవడం సంగతి దేవుడెరుగు దానికి రెండింతలు చేసి మరీ సాఫీగా దేశం దాటిస్తున్నారు.

నల్లధనాన్ని నిరోధించడానికి మోదీ ప్రతిష్మాత్మకంగా తీసుకొచ్చిన నోట్ల రద్దు కూడా దీనిపై ఎలాంటి ప్రభావం చూపలేదు సరికదా నోట్ల రద్దు తర్వాత స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీ 50 శాతం మేర పెరగటం విశేషం. అందుతున్న సమాచారం ప్రకారం 2017 లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం 7వేల కోట్లు పెరిగింది. స్విస్ బ్యాంకుల్లో అన్నీ దేశాల వ్యక్తులకు చెందిన డబ్బు 2017 లో 3 శాతం పెరిగి 100 లక్షల కోట్లుగా ఉందని ‘స్విస్ నేషనల్ బ్యాంక్’ నిన్న విడుదల చేసిన వార్షిక నివేదికలో తెలిపింది. 1987 నుంచి స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఉన్న డబ్బు వివరాలను ప్రజల ముందు ఉంచుతుంది. స్విస్ నేషనల్ బ్యాంక్ విడదల చేసిన డేటా ప్రకారం గత మూడేళ్లుగా స్విస్ బ్యాంకుల్లో తగ్గుతూ వస్తున్న భారతీయుల బ్లాక్‌మనీ 2017లో భారీగా 50 శాతం పెరిగింది. 2016లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల మనీ 45 శాతం తగ్గిపోయింది. ఆ ఏడాది చివరిలో మోడీ చేసిన నోట్ల రద్దు కారణంగా అది అత్యధికంగా 50 శాతం మేర పెరిగింది.