అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బులంద్‌షహర్‌కు చెందిన 20 ఏళ్ల సుధీక్షా భాటి అనే మహిళ రోడ్డు ప్రమాదంతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి కుటుంబసభ్యులు, పోలీసులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. తాజాగా సుధీక్షా భాటి యాక్సిడెంట్ కేసులో ఓ కొత్త ట్విస్ట్ కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.
సుధీక్షా కుటుంబం ఆరోపిస్తున్నట్లు ఆకతాయి వేధింపుల వల్లే ప్రమాదం జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. అంతేకాకుండా సుధీక్షా మెరిట్ స్టూడెంట్ అయినందున కేవలం ఇన్సురెన్స్ డబ్బుల కోసమే ఆమె కుటుంబం ఈ విధంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇందుకు తమ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
బులంద్‌షహర్ జిల్లాకు చెందిన సుదీక్ష భాటి(20) 2018లో సీబీఎస్‌సీ క్లాస్ 12 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 98 శాతం మార్కులు సాధించి అమెరికాలోని మసాచుసెట్స్‌లో గల బాబ్సన్ కాలేజ్‌లో స్కాలర్‌షిప్‌నకు అర్హత సాధించింది. ఈ క్రమంలో అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్న సుదీక్ష కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్‌లో భారత్‌కు తిరిగి వచ్చింది. ఆగష్టులో మళ్లీ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పత్రాల కోసం సోమవారం తన అంకుల్‌తో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి బయల్దేరింది. ఇంతలో ఓ ఆకతాయి వాళ్ల బైక్‌ను వెంబండించాడు.
వివిధ రకాల స్టంట్లు చేస్తూ సుదీక్ష ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. సదరు బైకర్ కావాలనే తమ కూతురిని వెంబడించి యాక్సిడెంట్ చేశాడని సుదీక్ష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడికి తగిన శిక్ష వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు బైక్ నడిపింది సుధీక్షా అంకుల్ కాదని, ఆమె తమ్ముడని పోలీసులు అన్నారు. ఇతను మైనర్ అని, సరైన అనుభవం లేని కారణంగానే ప్రమాదం జరిగిందని అంటున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఘటన జరిగిన సమయంలో సుధీక్షా అంకుల్ వేరే ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.