ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య విషయంలో భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కెనడా దౌత్య సిబ్బంది దేశం విడిచి వెళ్లాలని కేంద్ర సర్కార్ అల్టిమేటమ్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్ అల్టిమేటర్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఇండియా ఆదేశాలతో కెనడా సర్కార్ వారి దౌత్య వేత్తల్లో కొంతమందిని భారత్ నుంచి ఇతర దేశాలకు తరలించినట్లు సమాచారం. భారత్ ఆదేశాలతో ట్రూడో సర్కార్.. దిల్లీ మినహా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కెనడా దౌత్యవేత్తలను మలేసియా, సింగపూర్‌కు తరలించినట్లు ఓ అంతర్జాతీయ వార్త కథనం వెల్లడించింది. ఎంతమందిని భారత్ నుంచి తరలించారనేదానిపై మాత్రం క్లారిటీ లేదు.
ఈ వ్యవహారంపై అటు కెనడా నుంచి గానీ.. ఇటు భారత ప్రభుత్వం నుంచి గానీ అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. దౌత్యసిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరముందని భారత్ గతంలోనూ కెనడాకు సూచించినా.. ఇటీవల నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో మోదీ సర్కార్ సత్వర చర్యలకు ఉపక్రమించింది. ట్రూడో ఆరోపణలను ఖండించిన భారత్ విదేశాంగ శాఖ.. దౌత్య సిబ్బందిని తగ్గించుకునేందుకు కెనడాకు అక్టోబరు 10వ తేదీ వరకు దిల్లీ డెడ్‌లైన్ విధించింది.