టీకా వేసిన కొద్దిసేపటికే చిన్నారి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో చోటుచేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే టీకా వికటించి తమ చిన్నారి మృతిచెందిందని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.
సారపాకలోని మసీద్‌రోడ్డుకు చెందిన సోంపల్లి సందీప్ – నాగలక్ష్మి దంపతుల మూడు నెలల కుమార్తె గీతాన్వితకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో బుధవారం నెలవారీ టీకా, డ్రాప్స్ వేయించారు. అనంతరం చిన్నారిని ఇంటికి తీసుకెళ్తుండగా అపస్మారక స్థితికి చేరడంతో తిరిగి ఆరోగ్య ఉపకేంద్రానికి, అక్కడి నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అయితే, అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు చిన్నారి మృతదేహాన్ని సారపాక ఆరోగ్య ఉపకేంద్రానికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో అడిషనల్ డీఎంహెచ్‌ఓ దయానందస్వామి, తహసీల్దార్ భగవాన్‌రెడ్డి అక్కడికి చేరుకుని బంధువులతో మాట్లాడారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు వైద్యసిబ్బందిపై కేసు నమో దు చేస్తున్నట్లు ఎస్‌ఐ జితేందర్ తెలిపారు.