రూ. 13వేల కోట్ల‌తో ఇన్ఫోసిస్ బైబ్యాక్

infosys company announced shares buyback

 Posted August 19, 2017 at 16:21  

దేశీయ రెండో ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్… షేర్ల బై బ్యాక్ నిర్ణ‌యం పై  విశాల్ సిక్కా రాజీనామా ప్ర‌భావం ఏమీ క‌నిపించ‌లేదు. ముందే అనుకున్న‌ట్టుగా బోర్డు డైరెక్ట‌ర్ల స‌మావేశం నిర్వ‌హించి బైబ్యాక్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది ఇన్ఫోసిస్‌. రూ. 13వేల కోట్ల‌తో షేర్ల బైబ్యాక్ చేయ‌నున్న‌ట్టు తెలిపింది. ఒక్కోషేరును  రూ. 1,150కు కొనుగోలు చేస్తామ‌ని వెల్ల‌డించింది. చివ‌రి ట్రేడింగ్ లో షేరు ముగింపు ద‌ర రూ. 932కు 25శాతం ప్రీమియం ఇస్తూ ఈ షేర్ల‌ను తిరిగి కొనుగోలు చేస్తామ‌ని తెలిపింది.

సంస్థ 36 ఏళ్ల చ‌రిత్ర‌లో బైబ్యాక్ చేప‌ట్ట‌టం ఇదే తొలిసారి. డైరెక్ట‌ర్ల స‌మావేశంలో చ‌ర్చించి బైబ్యాక్ పై  నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తామ‌ని కొన్ని రోజుల కింద‌టే ఇన్ఫోసిస్ తెలిపింది. అంతా బైబ్యాక్ నిర్ణ‌యం కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్న వేళ రాజీనామా నిర్ణ‌యం ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు సంస్థ మాజీ సీఈవో విశాల్ సిక్కా. ఆయ‌న రాజీనామాతో బైబ్యాక్ ఉంటుందా లేదా అన్న చ‌ర్చ జ‌రిగింది. వీటికి తెర‌దించుతూ బైబ్యాక్ నిర్ణ‌యం ప్ర‌క‌టించింది ఇన్ఫోసిస్‌.

ఈ సంస్థ‌కు ముందే టీసీఎస్‌, విప్రో, హెచ్ సీ ఎల్ వంటి ఐటీ కంపెనీలు బైబ్యాక్ ప్ర‌కటించాయి. టీసీఎస్ రూ. 16వేల కోట్లు, విప్రో రూ.2500 కోట్లు, హెచ్ సీఎల్ రూ. 3,500 కోట్ల‌తో  షేర్ల బై బ్యాక్ ను ప్ర‌క‌టించాయి. . వాటాదార్ల‌కిచ్చిన షేర్ల‌ను తిరిగి వారినుంచే ఆ కంపెనీ కొనుగోలు చేయ‌టాన్నే షేర్ల బైబ్యాక్ అంటారు.  దీని వ‌ల్ల షేరు కొనుక్కున్న వారి ఆదాయం పెర‌గ‌ట‌మే కాక‌, వాటాదార్ల‌కు కంపెనీ వ‌ద్ద గ‌ల అద‌న‌పు సొమ్మును ఇవ్వ‌టానికి వీల‌వుతుంది. జూన్ 30, 2017 నాటికి ఇన్ఫోసిస్ వ‌ద్ద రూ. 22,750 కోట్ల అద‌న‌పు న‌గ‌దు ఉంది. బైబ్యాక్ నిర్ణ‌యంతో ఇప్పుడీ న‌గ‌దును వాటాదార్ల‌కు ఇవ్వ‌టానికి వీల‌వుతుంది.

మరిన్ని వార్తలు:

త‌ప్పు నీదే…కాదు మీదే

కాల్చ‌న‌క్క‌ర‌లేదు…ఉరితీయ‌న‌క్క‌ర‌లేదు…ఓటుతోనే జ‌గ‌న్ కు బుద్ధి చెప్పండి

చీలిక దిశ‌గా జేడీయూ

SHARE