స్వీడన్ లో వినూత్నం.. కరోనా రక్షిత రెస్టారెంట్‌ స్టార్ట్

లాక్‌డౌన్ త‌ర్వాత జ‌నాలు రెస్టారెంట్‌కు ఎగ‌బ‌డి వెళ్లే ప‌రిస్థితి ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఒక‌వేళ‌ కరోనా త‌గ్గిన‌ప్ప‌టికీ అంత ఈజీగా ఇంతకు ముందున్న పరిస్థితులు మ‌ళ్లీ క‌నిపించ‌క‌ పోవ‌చ్చు. దీంతో మార‌నున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఓ వినూత్న రెస్టారెంట్‌ను త‌యారు చేశారో చోట‌. ఇక్క‌డ మ‌నం ఆర్డ‌ర్ చేసే ఫుడ్‌ను ఎవ‌రూ వ‌చ్చి స‌ర్వ్ చేయ‌రు. కిచెన్ నుంచే వేడి వేడి ఆహారాన్ని తాడు స‌హాయంతో పంపిస్తారు. ఈ ఆలోచ‌న ఒక‌త్తైతే.. కేవ‌లం రోజుకు ఒక్క‌రినే అనుమ‌తించ‌డం మ‌రో స్పెషల్. ఇంత‌కీ ఈ రెస్టారెంట్ స్వీడ‌న్‌లో రెడీ అవుతోంది. అక్క‌డ సామాజిక దూరాన్ని క‌‌చ్చితంగా పాటిస్తూనే క‌స్ట‌మ‌ర్ల‌కు రుచిక‌ర‌మైన ఆహారంతో పాటు కొత్త అనుభూతిని పంచ‌నుంది.

అయితే అక్క‌డ‌కు వ‌చ్చేవారికి స్పెషల్ రూమ్స్ అంటూ ఉండవు. బ‌య‌ట గార్డెన్‌లో ఒక డైనింగ్‌ టేబుల్‌, ఒక కుర్చీ పెట్టి ఉంచుతారు. ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ ఎంచ‌క్కా క‌డుపు నిండేవ‌ర‌కు తినేయడమే ఉంటుంది. ఈ రెస్టారెంట్‌కు “బార్డ్ ఫ‌ర్ ఎన్” లేదా “టేబుల్ ఫ‌ర్‌ వ‌న్” అన్న పేర్ల‌ను ఆలోచిస్తున్నారు. అలాగే.. దీన్ని మే 10వ తేదీన స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ ఐడియా రాస్మ‌స్ ప‌ర్స‌న్‌, లిండా కార్ల్‌స‌న్ దంప‌తుల‌కు వ‌చ్చింది. ప్ర‌పంచంలోనే ఏకైక‌ క‌రోనా సుర‌క్షిత రెస్టారెంట్‌గా దీన్ని మారుస్తామ‌ని లిండా ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ రెస్టారెంట్‌కు అంద‌రూ ఆహ్వానితులేనంటూ ప్రకటనలిస్తున్నారు. అదేవిధంగా యూర‌ప్‌లో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ పాఠ‌శాల‌లు, రెస్టారెంట్లు, బార్లు తెరుచుకోవ‌చ్చ‌ని స‌డ‌లింపులు ఇచ్చింది. అయితే అన్ని ప్రాంతాల్లో కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని నియమం పెట్టడం విశేషం.