తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో కఠిన ఆంక్షలు, చట్టాలు అమలవుతున్నాయి. ఇప్పటికే స్త్రీ విద్యను నిషేధించడంతో పాటు స్త్రీలు ఉద్యోగం చేయడాన్ని వ్యతిరేకించి, వాళ్ళని వంటిళ్లకే పరిమితం చేశారు. చివరకు యూఎన్ కార్యక్రమాల్లో పనిచేసేందుకు అనుమతి లేకుండా చేశారు. షరియా చట్టంతో ప్రజలపై తీవ్ర ఆంక్షల్ని తాలిబాన్లు విధిస్తున్నారు.
ఇదిలా ఉంటే… తాజాగా మరో విచిత్రమైన ఆదేశాలిచ్చింది అక్కడి తాలిబాన్ సర్కార్.అఫ్గానిస్థాన్లో తాలిబన్ల జన్మస్థలమైన కాందహార్లో అధికారులు విచిత్రమైన ఆదేశాలు జారీ చేశారు. ఏ కార్యక్రమంలోనైనా జీవుల ఫొటోలు, వీడియోలు ఎవరూ తీయొద్దని స్పష్టం చేశారు. ‘ఇస్లాంలో మనుషులు, జంతువుల చిత్రాలపై నిషేధం ఉంది. కొందరు ముస్లింలు కొన్ని జీవులపై విరక్తితో ఉంటారు’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1996-2001 మధ్య తాలిబాన్ పాలనలోనూ టీవీల్లో జీవుల చిత్రాలపై నిషేధం ఉండేది.ఈ ఉత్తర్వులు ఎంత వరకు వర్తింపజేయబడుతాయి, ఎలా అమలు చేయబడుతుందనేది స్పష్టత లేదు. అయితే, ఈ లేఖ ప్రామాణికమైనదని కాందహార్ గవర్నర్ ప్రతినిధి తెలిపారు.