బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరేస్ రాజీనామా చేయాలని ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ డిమాండ్ చేశారు. లేదంటే ఆయనను అభిశంసించాలని పిలుపునిచ్చారు. ఇటీవల మోరేస్ పలువురు ప్రముఖుల సామాజిక మాధ్యమ ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో దుష్ప్రచారం నెపంతో ఖాతాలను బ్లాక్ చేసేందుకు ఆదేశిస్తున్నారని ఎలాన్ మస్క్ ఆరోపించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఆయన ప్రజాభీష్టాన్ని విస్మరిస్తున్నారని అన్నారు.
‘ఎక్స్’ను పూర్తిగా నిషేధిస్తామని బెదిరిస్తున్నారని మస్క్ ఆరోపించారు. దీని వల్ల బ్రెజిల్ నుంచి వస్తున్న ఆదాయం మొత్తం పోతుందని.. ఫలితంగా అక్కడ కార్యకలాపాలను మూసివేయాల్సి ఉంటుందని అన్నారు. లాభాల కంటే తమకు సిద్ధాంతాలే ముఖ్యమని తెలిపారు. బ్రెజిల్‌లో వాక్ స్వాతంత్ర్యంపై మోరేస్ విరుచుకుపడుతున్నారని మస్క్ సహా మరికొంతమంది ఆరోపించారు.
మరోవైపు మస్క్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి, తప్పుడు సమాచార వ్యాప్తిపై జరుగుతున్న విచారణలో మస్క్‌ను కూడా చేర్చారు. కోర్టు కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని.. తీర్పులకు వక్రభాష్యం చెబుతున్నారని పేర్కొన్నారు. అందుకు ఎక్స్‌ను ఆయుధంగా వాడుకుంటున్నారన్నారు.