ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదిస్తే చాలు… ఇక జీవితం సెటిలయిపోయినట్టే అనుకుంటారు యువతీయువకులు. కోటి ఆశలతో కొత్త కొలువు మొదలపెడతారు. ఉద్యోగంలో ఒక్కో మెట్టూ ఎదిగి ఆర్థిక స్థిరత్వం పొందాలనుకుంటారు. వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి మరీ ఆఫీసుకే అంకితమైపోయి పగలూ, రాత్రీ తేడాలేకుండా కష్టపడతారు. వర్క్ లో ఎన్నిరకాల టెన్షన్స్ ఎదురైనా వాటన్నింటినీ చిరునవ్వుతో అధిగమించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఏ ఐటీ ఉద్యోగిదైనా ఇదే పరిస్థితి. ప్రాజెక్టులు, డెడ్ లైన్లతో వారి జీవితం సాగిపోతుంటుంది.
ఐటీ జాబ్ తో సమాజంలో పెరిగే హోదా, ఉద్యోగం ఇచ్చే భరోసానే వారిని ముందుకు నడిపిస్తుంటుంది. కానీ ఆ ఉద్యోగమే ఊడిపోతే వారి పరిస్థితి ఏమిటి..? వర్క్ ఫెర్ ఫామెన్స్ బాగాలేదనో, నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోలేకపోయారనో..ఇలా ఏదో ఓ కారణంతో జాబ్ నుంచి తొలగిస్తే కాస్త అర్దముంటుంది. అలా కాకుండా కారణాలేమీ చెప్పకుండా ఉన్నట్టుండి హఠాత్తుగా ఉద్యోగుల నుంచి బలవంతంగా రాజీనామాలు తీసుకుని వారిని కంపెనీ నుంచి గెంటివేస్తే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి? ప్రముఖ ఐటీ సంస్థ వెరిజాన్ కంపెనీ ఉద్యోగులది ప్రస్తుతం ఇదే దుస్థితి. ప్రముఖ ఐటీ కంపెనీగా వెలుగొందుతున్న వెరిజాన్ చేసిన దుర్మార్గం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు..ఏకంగా 200 మంది ఉద్యోగులను వెరిజాన్ బలవంతంగా తొలగించడం ఐటీ సెక్టార్ లో కలకలం రేపుతోంది.
మాదాపూర్ ఐటీ కారిడార్ లో ఉన్న వెరిజాన్ నిర్వాకంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆ ఫిర్యాదు ప్రకారం కంపెనీ యాజమాన్యం 2017 డిసెంబర్ 12, 13 తేదీల్లో మీటింగ్ రూమ్ కు ఉద్యోగులను ఒక్కొక్కరిగా పిలిపించింది. అప్పటికే ఆ గదిలో బౌన్సర్లు, హెచ్ ఆర్ మేనేజర్ సిద్ధంగా ఉన్నారు. ప్రింటెండ్ పేపర్లు ఉద్యోగుల ముందుంచి రాజీనామా చేస్తున్నట్టు సంతకాలు చేయాలని యాజమాన్యం కోరింది. ఉద్యోగులు కొంత సమయం కావాలని కోరగా…హెచ్ ఆర్ మేనేజ్ మెంట్ నిరాకరించింది. రిజైన్ లెటర్స్ పై సంతకాలు చేయడం తప్ప మరో మార్గం లేదని తేల్చిచెబుతూ బౌన్సర్లకు సైగలు చేసింది. కొందరు ఉద్యోగులు సీట్లలోనుంచి బయటకు రావడానికి ప్రయత్నించగా..బౌన్సర్లు వారిని వెళ్లనీకుండా అడ్డుకున్నారు.
ఉద్యోగులను మానసికంగా, భౌతికంగా హింసించి రాజీనామా పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బందితో కలిసి బౌన్లర్లు ఉద్యోగులను కార్యాలయం నుంచి బయటకు గెంటివేశారు. ఉద్యోగుల సొంత వస్తువులను సైతం తీసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. వెరిజాన్ దారుణంపై కంపెనీ నుంచి ఉద్వాసనకు గురైన ముగ్గురు ఉద్యోగులు ఫిర్యాదుచేశారు. బౌన్లర్లు, సెక్యూరిటీ సిబ్బంది దురాగతం చుట్టుపక్కల భవనాల్లోని సీసీ కెమెరాల్లో కూడా రికార్డు అయిందని ఉద్యోగులు తెలిపారు. కంపెనీ యాజమాన్యం వాటిని ధ్వంసం చేసే అవకాశముందని, ఈ లోగానే ఫుటేజీని స్వాధీనం చేసుకుని పరిశీలించాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు ఆ కంపెనీపై సెక్షన్ 506 క్రిమినల్ తరహా బెదిరింపులు, సెక్షన్ 341 అమానుష ప్రవర్తన కింద కేసు నమోదుచేశారు. అటు వెరిజాన్ చెన్నైలోని ఉద్యోగులను కూడా భారీ ఎత్తున తొలగించినట్టు వార్తలొస్తున్నాయి.