టీటీడీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు గళం ఎత్తాక బీజేపీ నాయకులు అదే పాట పాడుతున్నారు. వైసీపీ నాయకులు కూడా అదే పల్లవి ఎత్తుకున్నారు. ఈ అందరి మాటతో శ్రీవారి కొండ మీద ఏదో జరుగుతోందని భక్తులు ఈ పాటికే రోడ్ల మీదకు రావాల్సింది. కానీ అలా జరగడం లేదు. పైగా ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగం అని ఆంధ్రప్రదేశ్ లో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతున్నాడు.శ్రీవారి వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్న వాళ్ళ మీద జనం కోపం కూడా పెంచుకుంటున్నారు. అందుకే పార్టీలు ఎంత రచ్చ చేస్తున్నా జనంలో ఈ విషయం మీద పెద్దగా స్పందన లేకుండా పోతోంది. టీటీడీ లో ఒక వేళ అక్రమాలు జరిగినా అది ఇప్పటికిప్పుడు జరిగిన వ్యవహారం కాదని కూడా ప్రజల్లో ఓ భావం వుంది. దీంతో ఎంత రెచ్చగొట్టినా జనంలో కదలిక లేకపోయే సరికి ఇంకో అస్త్రం బయటకు వచ్చింది. అదే జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ అస్త్రం.
టీటీడీ లో అక్రమాలపై కొన్నాళ్లుగా రమణ దీక్షితులు సహా విపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ఇంకో సారి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ప్రస్తావించారు. పింక్ డైమండ్ లాంటి అంశాల్ని కూడా ముందుకు తెచ్చారు. ఇవన్నీ పాత విషయాలే. అయినా తనకు విమానాశ్రయంలో కనపడ్డ ఓ సీనియర్ ips అధికారి ఈ విషయాలు చెప్పారని పవన్ చెప్పడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్ తో అంత చనువుగా వ్యవహరించే ips అధికారి ఎవరా అన్న చర్చ మొదలైంది. కానీ ips సర్కిల్స్ లో పూర్తి పట్టున్న కొందరు ఆరా తీస్తే పవన్ తో అలాంటి చర్చ జరిపిన దాఖలాలు లేవని తేలింది. దీంతో నమ్మకం లేని విషయాల పట్ల జనంలో నమ్మకం కలిగించడానికి పవన్ ఓ సీనియర్ ips అధికారి అన్న ప్రస్తావన చేసినట్టు అనిపిస్తోంది. ఇంతకు ముందు లోకేష్ మీద అవినీతి ఆరోపణలు చేసినప్పుడు, ఆధారాలు చూపించమని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తే ఎవరో చెప్పగా కోట్ చేసినట్టు పవన్ వివరించారు. అయితే అలా చెప్పడం అప్పట్లో హాస్యాస్పదం అయ్యింది. ఇప్పుడు ఆ ips అధికారి ఎవరో చెప్పాలన్న డిమాండ్ వస్తే పవన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో పాపం!