Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ చేసిన ఈ ప్రకటన అమెరికా మిత్ర దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. ట్రంప్ నిర్ణయం తమకు ఆందోళన కలిగిస్తోందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ సంయుక్త ప్రకటన చేశారు. ఇరాన్‌తో అణుఒప్పందం భద్రతకు సంబంధించిన అంశమని… దీన్ని కొనసాగించాలన్న మిత్ర దేశాలు చేసిన విజ్ఞప్తిని ట్రంప్ పట్టించుకోలేదు. ట్రంప్ నిర్ణయాన్ని రష్యా వ్యతిరేకించగా… సౌదీ అరేబియా సమర్థించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ఇరాన్ అణు ఒప్పందం కుదిరింది.
అయితే బరాక్ ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని తాజాగా ట్రంప్ సర్కారు తెంచేసుకోవడంతో ఇప్పుడు ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోతోంది. అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగినందుకు నిరసగా పార్లమెంటులో అమెరికా జాతీయ జెండాను తగలబెట్టి అమెరికాని ఘోరంగా అవమానించింది. నిన్న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వెంటనే అమెరికా తీరుపై నిరసన వ్యక్తం చేసిన సభ్యులు, అమెరికాకి, ట్రంప్ కీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం యూఎస్ జాతీయ పతాకాన్ని తీసి నిప్పుపెట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అణు ఒప్పందం వైదొలగడమే కాక 2015 ఒప్పందంలో ఎత్తివేసిన ఆంక్షలన్నింటినీ తిరిగి ఇరాన్ పై విధిస్తామని ప్రకటించారు.