కరోనా మహామ్మారి క్రికెట్ ప్రపంచంపై మరోసారి పంజా విసురుతుంది. కొద్ది గంటల క్రితమే ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కాగా.. తాజాగా మరో ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు పాజిటివ్‌గా తేలింది. కీలకమైన విండీస్ పర్యటనకు ముందు అమెరికాలో బస చేస్తున్న ఐర్లాండ్ ఆటగాళ్లు పాల్ స్టిర్లింగ్, షేన్ గెట్‌కేట్ కరోనా బారిన పడ్డారు.
వచ్చే ఏడాది జనవరి 8 నుంచి 23 వరకు విండీస్‌తో మూడు వన్డేలు, టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లు మహమ్మారి బారిన పడడంతో ఐర్లాండ్ జట్టులో కలవరం మొదలైంది. స్టిర్లింగ్, గెట్కేట్లు ఇద్దరు వేర్వేరుగా 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నట్లు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వీరిద్దరు జనవరి 9న తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని జట్టు యాజమాన్యం పేర్కొంది.
కాగా, పాల్ స్టిర్లింగ్ ఐర్లాండ్ తరఫున 134 వన్డేల్లో 38.09 సగటుతో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 4982 పరుగులు, 94 టీ20ల్లో 30.06 సగటుతో ఓ సెంచరీ, 19 హాఫ్ సెంచరీల సాయంతో 2606 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 43 వన్డే వికెట్లు, 20 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇక, షేన్ గెట్‌కేట్ విషయానికొస్తే.. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఐర్లాండ్ తరఫున 4 వన్డేలు, 25 టీ20లు ఆడాడు.