కరీబియన్ దీవులను అతలాకుతలం చేసిన ఇర్మా తుఫాన్ అమెరికాను తీవ్రంగా వణికిస్తోంది. కరీబియన్ తీరాన్ని తాకిన తర్వాత మరింత ఉధృతంగా మారి కేటగిరి 4 హరికేన్ గా ఇర్మా రూపాంతరం చెందినట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో గంటకు 209కిలో మీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశముంది. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఫ్లోరిడాలోని మూడోవంతు ప్రాంతాన్ని అధికారులు ఖాళీ చేయించారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ ఇళ్లల్లోనుంచి బయటకు రావొద్దని ఫ్లోరిడా కీవెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఫ్లోరిడా నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు తరలివెళ్తుండటంతో రోడ్లు కిక్కిరిసిపోయి ట్రాఫిక్ జాం అవుతోంది. ఫ్లోరిడాలో 76వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజల్ని రక్షించేందుకు దాదాపు 7,400మంది అమెరికా సైన్యం రంగంలోకి దిగింది. ప్రజలను కాపాడేందుకు 140 విమానాలు, 650 ట్రక్కులు, 150 బోట్లను సిద్దం చేసినట్టు పెంటగాన్ ప్రకటించింది. 1992లో వచ్చిన ఆండ్రూ హరికేన్ తర్వాత ఆ స్థాయిలో ఫ్లోరిడాను ముంచెత్తుతోంది ఇర్మానే అని అధికారులు చెబుతున్నారు. అటు ఫ్లోరిడా, మియామి, టంప ప్రాంతాల్లో ఉన్న భారతీయులను రక్షించేందుకు భారత దౌత్య కార్యాలయం 24 గంటల హెల్ప్‌లైన్ సదుపాయాన్ని కల్పించింది. అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సింగ్ సర్నా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
మరిన్ని వార్తలు: