ఉత్తరాంధ్రని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తే ఆత్మగౌరవ పోరాటం మొదలవుతుందని అది తెలంగాణ ఉద్యమ స్థాయికి చేరుతుందని పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ట్వీట్ రాజకీయంగా ఆయన దిగజారుడు తనానికి ఇంకో ఉదాహరణ. ఉత్తరాంధ్ర ప్రజలని పాలక పక్షానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడమే లక్ష్యంగా సాగుతున్న ఆయన రాజకీయ యాత్రలో ఇది కచ్చితంగా వ్యూహాత్మక తప్పిదమే. రాష్ట్ర విభజన గాయం నుంచి ఇంకో కోలులోని ఆంధ్రప్రదేశ్ ని పొలిటికల్ లీడర్స్ ఎలా చూస్తున్నారో కానీ జనానికి మాత్రం వాస్తవ పరిస్థితులు తెలుసు. ఉత్తరాంధ్ర కి అన్యాయం జరుగుతుందని భావిస్తున్న పవన్ కి హుద్ హుద్ తుఫాన్ తర్వాత విశాఖ రూపుదిద్దుకున్న తీరు చూస్తే మంచిది. సరే ఆయన అనుకున్నట్టే ఉత్తరాంధ్ర ని పాలకులే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకుంటే ఇప్పుడు అక్కడ ప్రజల ప్రధాన డిమాండ్లు రెండు. అందులో మొదటిది విశాఖ కి రైల్వే జోన్ , రెండోది వెనుకబడిన జిల్లాలకు విదర్భ తరహాలో ప్యాకేజ్. ఈ రెండు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద వుంది. ప్రధాని మోడీని ఈ విషయంలో డిమాండ్ కాదు కదా కనీసం విన్నపం చేసే ధైర్యం కూడా పవన్ కి ఎందుకు లేకపోయింది ?. సరే ఈ ప్రశ్నకు పవన్ జవాబు చెప్పకుండా దాటేయడం వెనుక కారణాలు అర్ధం చేసుకుందాం. కానీ మోడీ , చంద్రబాబు కాకుండా ఉత్తరాంధ్ర కి పవన్ తల్చుకుంటే జరిగే పని ఒకటుంది.
పవన్ తన నిర్మాతలతో పాటు చిత్ర రంగాన్ని ఒప్పించి ఉత్తరాంధ్రలో సినిమా షూటింగ్ లు ఎక్కువగా జరిగేలా చేయొచ్చు. తద్వారా ఓ కొత్త రంగం అక్కడ వేళ్లూనుకునేలా చర్యలు తీసుకోవచ్చు. అలాంటిది ఏమీ చేయకుండా , అసలు అక్కడ ప్రజల అవసరాలకు తగ్గ డిమాండ్స్ చేయకుండా మాటిమాటికీ విభజన వాదం వినిపించడం వల్ల ప్రయోజనం ఉంటుందా ?.. ఈ పని ఓ సాధారణ రాజకీయ నాయకుడు చేస్తే సరేలే అనుకోవచ్చు. కానీ జనసేన కుల,మత , ప్రాంతీయ రాజకీయాలకు దూరం అని చెప్పడమే కాదు కేవలం అధికారం కోసమే అడుగులు వేయబోమని ఒకప్పుడు ఇదే జనసేనాని గర్వంగా ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడకపోయినా పర్వాలేదు. కనీసం ఉత్తరాంధ్రలో పోటీ , ఉద్యమానికి నాయకత్వం అని చెప్పే ముందు కనీసం అక్కడ ఓ ఇల్లు ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన అయినా పవన్ ఎందుకు చేయలేకపోయారో. ఆయన మాత్రం రాజధాని అమరావతికి అనుకుని వున్న కాజా గ్రామంలో భారీ ఇల్లు కట్టుకుంటారు. అక్కడ భూముల ధరలు తెలుసుకోడానికి పార్టీ నేతలతో కలిసి పర్యటనలు చేస్తారు. కానీ అక్కడ అభివృద్ధి చెందడం అనేది ఉత్తరాంధ్రకు వ్యతిరేకం అన్నట్టు మాట్లాడుతారు. అదే నిజం అయితే ఆయనకి కాజాలో ఇల్లు ఎందుకో ? ఆయన కూడా కాజాలో ఇల్లు కట్టుకున్నందుకు ఉత్తరాంధ్ర వ్యతిరేకి అయిపోతారా ? అధికారం , పదవుల కోసం నాయకులు అడ్డ దారులు తొక్కుతారేమో గానీ ప్రజలకు ఎవరెందుకు మాట్లాడుతున్నారో బాగా తెలుసు. రాజకీయాల్లో మహామహులు చాలా మంది ఈ విషయంలో జనాన్ని తక్కువ అంచనా వేసి దెబ్బ తిన్నారు. అందుకు పవన్ అతీతుడు ఏమీ కాదు.