Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా ఉగ్రదాడికి తామే బాధ్యులమని ప్రకటించింది ఉగ్రవాద సంస్థ ఐసిస్. దాడికి పాల్పడిన నిందితుడు సైఫుల్లా సైఫో తమ సైనికుడే అని ఐసిస్ చెప్పుకున్నట్టు అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ మానిటరీ గ్రూప్ ఎస్ఐటీఈ వెల్లడించింది. న్యూయార్క్ వీధుల్లో ట్రక్కుతో బీభత్సం సృష్టించింది ఇస్లామిక్ స్టేట్ సైనికుల్లో ఒకడని, ఆ సంస్థకు చెందిన ఒక వార్తాపత్రికలో ప్రచురితమయిందని ఎస్ఐటీఈ తెలిపింది. అల్లా దయ వల్ల ఈ దాడితో అమెరికాలో భయం పెరిగిందని, దీంతో ఆ దేశంలో భద్రతను కట్టుదిట్టం చేస్తారని, అమెరికాకు వెళ్లే వలసదారులపై చర్యలు తీసుకుంటారని ఐసిస్ పేర్కొంది.
అయితే పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న కొన్ని ఘటనలతో తమకు సంబంధం లేకపోయినా… ఉనికి కోసం ఐసిస్… వాటిని తన ఖాతాలో వేసుకుంటోంది. గత నెలలో అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన కాల్పులు తమ పనే అని ఐసిస్ ప్రకటించింది. స్టీఫెన్ ప్యాడక్ అనే దుండగుడు ఇష్టారీతిన కాల్పులు జరిపి 58 మందిని పొట్టనపెట్టుకున్నాడు. స్టీఫెన్ తమ సైనికుడే అని ఐసిస్ తెలిపింది. తర్వాత ఎఫ్ బీఐ దర్యాప్తులో ఐసిస్ కు, స్టీఫెన్ కు ఎలాంటి సంబంధం లేదని తేలింది.
ట్రక్కు దాడిచేసిన నిందితుడు కూడా తమ సైనికుడే అని ఐసిస్ ప్రకటించినప్పటికీ… అమెరికా పోలీసులు ఇంకా నిర్దారించలేదు. అయితే పోలీసుల అదుపులో ఉన్న సైఫుల్లా ఐసిస్ వీడియోలు చూసి ప్రేరణపొంది తానీ దాడి చేశానని విచారణలో వెల్లడించారు. తాను చేసిన పనిపై చాలా ఆనందంగా ఉన్నానని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో ఐసిస్ ప్రకటన కొంతవరకు నిజమై ఉండొచ్చని అమెరికా పోలీసులు భావిస్తున్నారు. సైఫుల్లా నేరుగా ఐసిస్ వద్ద శిక్షణ పొందాడా లేక… పరోక్షంగా ఐసిస్ తో సంబంధాలు ఉన్నాయా… అన్నది విచారణలో తేలనుంది.