ఓ వైపు ఆగ్ర‌హం, మ‌రోవైపు భ‌రోసా

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

ఉగ్రవాదుల‌కు స్వ‌ర్గ‌ధామంగా త‌యార‌యిందంటూ పాకిస్థాన్ పై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల దుమారం కొన‌సాగుతూనే ఉంది. ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను పాక్ తోసిపుచ్చింది. పాకిస్థాన్ ను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు త‌మ‌ను తీవ్రంగా నిరాశప‌ర్చాయ‌ని, ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభ్యంత‌రం వ్య‌క్తంచేసింది. తీవ్ర‌వాదం కార‌ణంగా ప్ర‌పంచంలో మ‌రే దేశం పాకిస్థాన్ కంటే ఎక్కువ‌గా న‌ష్ట‌పోవ‌టం లేద‌ని, ఉగ్ర‌వాదం నిర్మూల‌నకు తాము ఎప్పుడూ క‌ట్టుబ‌డి ఉంటామ‌ని ప్ర‌క‌టించింది. ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను  ఖండిస్తున్నామ‌ని తెలిపింది. అయితే పాకిస్థాన్ ప్ర‌క‌ట‌న‌పై అమెరికా మ‌రోసారి తీవ్రంగా మండిప‌డింది. ఉగ్ర‌వాదంపై చ‌ర్య‌లు తీసుకోవ‌టం  ప్రారంభించ‌ని ప‌క్షంలో అమెరికాతో అతిపెద్ద నాటోయేత‌ర భాగ‌స్వామ్య‌దేశంగా ఉన్న హోదాను  పాకిస్థాన్ కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని అమెరికా విదేశాంగ మంత్రి రెడ్ స్టిల్ల‌ర్ హెచ్చ‌రించారు.

ఈ హోదా వ‌ల్లే ఇప్ప‌టిదాకా పాక్ కు  ఆర్థికంగా, సైనిక ప‌రంగా అమెరికా నుంచి స‌హాయ స‌హ‌కారాలు అందించామ‌ని, దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల దృష్ట్యా పాకిస్థాన్ కు ఏం కావాలో తేల్చుకోవాలని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. అటు అమెరికా హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో  పాక్ మిత్ర‌దేశం చైనా మ‌రోసారి ఆ దేశాన్ని స‌మ‌ర్థించింది. చైనా స్టేట్ కౌన్సిల‌ర్ యాంగ్ జిచి అమెరికా విదేశాంగ మంత్రితో ఫోన్ లో మాట్లాడారు. పాకిస్థాన్ సార్వ‌భౌమాధికారాన్ని, భ‌ద్ర‌తా ఆందోళ‌న‌ల‌ను అమెరికా గౌర‌వించాల‌ని చైనా కోరింది. ఉగ్ర‌వాదంపై పోరు విష‌యంలో్ పాక్ రాజీలేని పోరు కొన‌సాగిస్తోంద‌ని చైనా ప్ర‌శంసించింది. ఆఫ్ఘ‌నిస్థాన్ ప‌రిణామాల్లో పాకిస్థాన్ క్రియాశీల‌క పాత్ర పోషిస్తుంద‌ని చైనా అమెరికాకు హామీ ఇచ్చింది. ఆఫ్ఘ‌న్ పై కొత్త వ్యూహం ప్ర‌క‌టించే క్ర‌మంలోనే డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తోంద‌ని మండిప‌డ్డారు. మొత్తానికి పాకిస్థాన్ కు అంతర్జాతీయంగా ఒకేసారి రెండు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. ఓ వంక  ఆ దేశ వైఖ‌రిని అమెరికా తూర్పార‌ప‌డుతోంటే…మ‌రో ప‌క్క‌..చైనా మాత్రం అన్నింటిలోనూ నేనున్నానంటూ భ‌రోసా ఇస్తోంది.

 మరిన్ని వార్తలు:

మ‌రోసారి త‌మ పౌరుల‌కు అడ్వైజ‌రీ జారీ చేసిన చైనా

నంద్యాలలో పేలిన తూటా… శిల్పా సేఫ్.