ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. గాజాపై ఇజ్రాయెల్ నిరంతరంగా దాడులు చేస్తోంది. ఓవైపు వైమానికి దాడులు.. మరోవైపు భూతల దాడులతో గాజా ప్రాంతంలో నరమేధం సృష్టిస్తోంది. హమాస్‌ను సమూలంగా అంతం చేయడమే లక్ష్యంగా గాజాను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైన్యం.. మంగళవారం రోజున హమాస్ పార్లమెంటు, పోలీసు ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
ఇవే కాకుండా గాజాలోని ప్రభుత్వ కార్యాలయాలు, గవర్నర్ ఇల్లు, హమాస్ మిలిటరీ వింగ్, 7వ సాయుధ బ్రిగేడ్, నిఘా విభాగం కార్యాలయాలు, గొలానీ ఇన్ఫాంట్రీ, బ్రిగేడ్లను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య జరుగుతున్న భీకర పోరులో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నరమేధంతో గాజాలోని అతి పెద్ద అల్-షిఫా ఆసుపత్రి మృతదేహాల గుట్టగా మారిపోయింది. ఇంధనం లేక.. జనరేటర్లు పని చేయక వైద్య సేవలు అందకపోవడంతో 179 మంది మరణించగా.. ఆస్పత్రి ఆవరణలోనే ఆ శవాలన్నింటినీ సామూహికంగా ఖననం చేసినట్లు సమాచారం.