కరోనా వైరస్ నేపథ్యంలో చైనాలోని అన్ని విమానాశ్రయాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అయితే,షాంగై విమానాశ్రయంలోని థాయ్ ఎయిర్లైన్స్లోకి ప్రవేశించిన తర్వాత కూడా పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఓ మహిళ ప్రయాణికురాలి సహనం నశించింది. దగ్గు రాకపోయినా విమాన సిబ్బంది మీద దగ్గింది. దీంతో సిబ్బంది షాకయ్యారు. ఓ ఫ్లైట్ అటెండర్ వెంటనే మహిళను వెనక్కి వంచి గట్టిగా పట్టుకున్నాడు. ఆమె వాళ్ల మీదకు దగ్గకుండా తలను గట్టిగా పట్టుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందికి అప్పగించారు.
ఈ ఘటన వల్ల విమానం ఏడు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. ఆమె వల్ల విమానంలో ఉన్న ప్రయాణికులంతా మళ్లీ కిందికి దిగి మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోవలసి వచ్చింది. పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే విమానం ప్రయాణికులతో బయల్దేరింది.