శ్రీలంక స్టార్ క్రికెటర్ ఇసురు ఉదాన అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న లంక బోర్డుకు ఉదాన నిర్ణయం షాక్ అనే చెప్పాలి. కాగా ఉదాన ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లాడి ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి 39 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు.
అంతకముందు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన ఉదానా రెండు ఓవర్లు బౌల్ చేసి 27 పరుగులిచ్చుకున్నాడు.2009 జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 33 ఏళ్ల ఉదానా 21 వన్డేల్లో 237 పరుగులు.. 18 వికెట్లు, 34 టీ20ల్లో 256 పరుగులతో పాటు 27 వికెట్లు పడగొట్టాడు. 33 ఏళ్ల ఇసురు ఉదాన 2021 టీ20 వరల్డ్‌కప్ జట్టులో కీలకంగా మారతాడని లంక బోర్డు భావించింది.
సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయిన శ్రీలంక జట్టు, గ్రూప్ స్టేజ్‌లో ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్‌తో మ్యాచులు ఆడనుంది. గ్రూప్ మ్యాచుల్లో టాప్ 2లో నిలిచిన జట్లు, సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధిస్తాయి. ఇక గత సీజన్లో ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన ఇసురు ఉదాన 2020 సీజన్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన ఒకే ఒక్క లంక క్రికెటర్‌గా నిలిచాడు. 2021 మెగా వేలానికి ముందు ఉదానను ఆర్సీబీ రిలీజ్ చేయడం, వేలంలో ఉదానను ఎవ్వరూ కొనుగోలు చేయలేదు.