ఓ పక్క కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంటే.. కొందరు చదువుకున్న అపర మేధావులు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. ఉన్నత చదువులు, ఆపై ఐటీ ఉద్యోగాలు చేస్తూ… తామే గ్రేట్… అనుకుంటున్న కుహానా మేధావులు రెచ్చిపోతున్నారు. సోషల్మీడియాలో చెత్త పోస్టులు పెట్టి ప్రజలను మరింత భయాందోళన కలిగిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కర్ణాటకలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన పోస్ట్ తీవ్ర కలకలం సృష్టించింది.
అదేమంటే.. బెంగళూరులోని ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ మధ్య సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టాడు. “ప్రజలారా బయట స్వేచ్ఛగా తిరగండి… తుమ్మండి… కరోనా వైరస్ని వ్యాపింపజేయండి” అంటూ అతను పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఫేస్బుక్ అకౌంట్లోని వివరాల ఆధారంగా అతడిని అరెస్టు చేశారు. దీంతో చాలామంది నెటిజన్లు ఇన్ఫోసిస్ సంస్థపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ ఘటనపై స్పందించిన ఇన్ఫోసిస్ యాజమాన్యం.. ఇలాంటి పోస్టులు చేయడం కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకమని తెలిపారు. అలాగే.. తమ సంస్థకు చెందిన ఉద్యోగి ఆ పోస్ట్ ను కావాలనే చేశాడని అంతర్గత దర్యాప్తు ద్వారా తేల్చారు. అంతేకాకుండా ఇలాంటి చర్యలను తాము సహించబోమని ప్రకటించిన యాజమాన్యం… అతడిని సంస్థ నుంచి తొలగిస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం బెంగళూరులోని ఇన్ఫోసిస్ ఉద్యోగికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ సంస్థ తమ ఉద్యోగులందరినీ ఇంటికి పంపించిన విషయం తెలిసిందే.