గత నెలలో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన తూర్పు గోదావరి జిల్లా మండపేటలో నాలుగేళ్ల బాలుడు జషిత్ కిడ్నాప్ వెనుక అసలు నిజాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ మీడియాకు వెల్లడించారు. ఈ కిడ్నాప్ క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలోనే సాగిందని ఆయన స్పష్టం చేశారు.
అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, జషిత్ కిడ్నాప్ పై మరిన్ని వివరాలు అందించారు. క్రికెట్ బెట్టింగ్ తో సంబంధమున్న 17 మంది బుకీలను అరెస్ట్ చేశామని, జషిత్ కిడ్నాప్ వెనుక, జషిత్ బంధువుల హస్తం కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని అన్నారు.
అన్ని కోణాల్లోనూ కేసును దర్యాఫ్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. బాలుడిని మూడు రోజుల పాటు ఎక్కడ దాచివుంచారన్న విషయాన్ని కూడా నిర్ధారించామని నయీమ్ అస్మీ వెల్లడించారు.